07-09-2025 02:01:27 PM
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగియడం పట్ల సీఎం హర్షం
హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు( Ganesh immersion) ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) హర్షం వ్యక్తం చేశారు. పోలీసు శాఖపై రేవంత్ రెడ్డి ప్రసంసలు కురిపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ(Police Department) పనిచేసిందని తెలిపారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహాకులు, క్రేన్ ఆపరేటర్లు అందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం(Ganesh immersion ceremony) సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. మహాత్మ్యమైన నిమజ్జన కార్యక్రమాన్ని గమనించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా శనివారం నాడు ట్యాంక్ బండ్ కు వెళ్లారు. పరిమిత వాహనాలతో, సాదాసీదాగా, ఎటువంటి ప్రత్యేక హంగులు లేకుండా సామాన్య ప్రజల మాదిరిగా ఆయన కార్యక్రమాన్ని పరిశీలించారు. సీఎం ట్యాంక్ బండ్ సడన్ విజిట్ చేయడంతో అందరూ షాకయ్యారు.