21-01-2026 01:08:04 AM
బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలడు: ప్రధాని మోదీ
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నబీన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ, జనవరి ౨౦: తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు బీజేపీ విధానాలను ఆదరిస్తున్నారని చెప్పారు. గతంలో అసాధ్యం అనుకున్న చోట్ల కూడా పార్టీ అద్భుత విజయాలు సాధించిందని, అదే అద్భుతం తెలంగాణ, బెంగాల్‌లోనూ జరుగుతుందని జోస్యం చెప్పా రు.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. తాను ఒక సాధారణ కార్యకర్తనని, నితిన్ నబీన్‌నే తనకు బాస్ అని వ్యాఖ్యానించారు. గడిచిన పన్నెండేళ్లలో పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు.
తమ పార్టీలో ఒక సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాగలరని తెలిపారు. పార్టీ కొత్త దళపతి నేతృత్వంలో ఎన్నో విజయాలు సాధిస్తామని ఆకాంక్షించారు. తమ పార్టీ అంతా ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తుందని వివరించారు. తమ పార్టీలో పదవుల కంటే బాధ్యతలకే ప్రాధాన్యం ఉంటుందని వ్యాఖ్యానించారు. అధ్యక్షులు మారినా, పార్టీ ఆశయాలు మాత్రం మారవని స్పష్టం చేశారు. దేశాభివద్ధిలో రాబోయే పాతికేళ్లు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.
యువ నాయకత్వం పార్టీని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కొత్తగా వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఏఐ గురించి తెలుసుకోవాలి’ అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.