11 March, 2026 | 3:37 AM

‘గ్యారెంటీ’ ఉందా?

11-03-2026 12:26 AM

సంస్థలు, కంపెనీల పరిస్థితిని పరిశీలించకుండానే రూ. వేల కోట్ల గ్యారెంటీలిస్తున్న బ్యాంకులు

  1. రూ. వేల కోట్లను ఎన్‌క్యాష్ చేసుకుంటున్న సంస్థలు, కంపెనీలు
  2. డేంజర్ జోన్‌లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
  3. సిండికేట్ అవుతున్న కంపెనీలు, సంస్థలతో తలనొప్పి తప్పదు

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): బ్యాంకు గ్యారెంటీ.. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు చేపట్టే పనులను చేసే కాంట్రాక్టర్లు, కంపెనీలు, సంస్థలకు బ్యాంకులు ఇచ్చే హామీ ఇది. బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకపోతే.. పనులు జరగవు. పనులు చేపట్టే అవకాశంకూడా కేవలం బ్యాంకు గ్యారెంటీపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైనా కంపెనీ, కాంట్రాక్టు సంస్థ అయినా ఏ ప్రభుత్వ పనులను చేపట్టాలన్నా బ్యాంకు గ్యారెంటీ అనేది తప్పనిసరి.

అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలతో.. బ్యాంకులు జారీ చేసే బ్యాంకు గ్యారెంటీ సమయంలో సరైన నిబంధనలు పాటిస్తున్నారా.. అసలు చెక్ లిస్ట్ చూసుకుంటున్నారా.. ఒత్తిడికి లోనై కంపెనీల వృద్ధి, చెల్లింపులు, చేపట్టిన ప్రాజెక్టులు, పూర్తయినవి, పెండింగు పనులు తదితర అంశాలన్నింటినీ పరిశీలస్తున్నాయా..

అసలు ఓపెన్ బిడ్డింగ్‌లోనే పని కాంట్రాక్టు దక్కిందా.. లేక సిండికేట్ అవ్వడం వల్లనా అనే అంశాలుకూడా పట్టించుకున్నట్టుగా కనపడటం లేదు. దీనితో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఇలాంటి అంశాలను పరిశీలించకుండానే బ్యాంకు గ్యారెం టీలు జారీచేస్తే.. భవిష్యత్తులో సదరు బ్యాంకు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరి స్తున్నారు.

బ్యాంకు గ్యారెంటీ.. ఎన్‌క్యాష్..

ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థ లు జారీచేసే పనులను చేపట్టడానికి కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు ముందుకు వస్తాయి. అయితే సదరు పని కాంట్రాక్టు ఆ కంపెనీకి దక్కిన తరువాత బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా కంపెనీ తరఫున పెర్ఫార్మెన్స్ గ్యారెంటీ, ఫైనాన్సియల్ గ్యారెంటీ, బిడ్ బాండ్, మొబిలైజేషన్ అడ్వాన్ గ్యారెంటీలను ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు బ్యాంకు ఇస్తుంది.

అయితే తాజా గా.. తరచుగా జరుగుతున్న కొన్ని సంఘటనల్లో ఇలా ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీలను తరువాతి కాలంలో సదరు కంపెనీలు, సంస్థ లు ఎన్‌క్యాష్ చేసుకుంటున్నారు. దీనితో బ్యాంకులు ఇబ్బందుల్లో పడుతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కార ణం.. బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేముందు.. సదరు కాంట్రాక్టు సంస్థ, కంపెనీల ఆర్థిక, కార్యనిర్వహణ, నిర్మాణ, పూర్తిచేసిన, చేయాల్సిన కాం ట్రాక్టు పనులను సరిగా పరిశీలించకపోవడమే కారణమని నిపుణులు చెబు తున్నారు.

లోతుగా పరిశీంచాలి..

నిజానికి బ్యాంకులు.. కాం ట్రాక్టు సంస్థలక, కంపెనీలకు బ్యాం కు గ్యారెంటీ ఇచ్చేముందు.. సదరు సం స్థ, కంపెనీ చేపట్టి పూర్తి చేసిన పనులు, పెండింగులో ఉన్న పనులను చూడాల్సిన బా ధ్యత బ్యాంకుపై ఉంటుంది. అలాగే ఆర్థిక వృ ద్ధి, టర్నోవర్, కాంట్రాక్టు దక్కిన విధానం, కాంపిటీటివ్ బిడ్డింగ్ పద్ధతిలో టెండర్ దక్కిందా.. లేక సిండికేట్ కావడం వల్ల వచ్చిం దా అనేది లోతుగా పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే సబ్ కాంట్రా క్టులకు ఎలా చెల్లింపులు చేశారు.. సకాలంలో చెల్లించారా.. బకాయిలు ఎంత వరకు ఉన్నా యి అనే ఆర్థిక పరమైన అంశాలను లోతుగా పరిశీలించాలని సూచిస్తున్నారు. కంపెనీ వృద్ధి అనూహ్యంగా ఉందా.. పద్ధతిప్రకారం ముం దుకు వెలుతుందా అనేదికూడా చూడాలంటున్నారు. 

అనుభవం.. నాణ్యత..

సదరు కంపెనీలు, కాంట్రాక్టు సంస్థలకు ఉన్న అనుభవంకూడా ముఖ్యమైనదేనని, అలాగే గతంలో పూర్తిచేసినట్టుగా చెప్పిన పనులు నాణ్యంగా చేశాయా.. లేక నాణ్యతా లోపంతో ఉన్నాయా అనేదికూడా చూసుకోవాలని నిపుణులు బ్యాంకులకు హితవు చెబు తున్నారు. పైగా సందరు కంపెనీలకు క్వాలిటీ విభాగం ఉందా.. లేక థర్డ్‌పార్టీతో క్వాలిటీ చెక్ చేయిస్తున్నారా అనేదికూడా చూసుకోవాలంటున్నారు. అలా చూసుకోకపోతే.. ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా అన్ని అంశాలను పరిశీలించిన తరువాతనే బ్యాంకులు గ్యారెంటీలను జారీచేయాలని, ఇందుకు తగినన్ని ఆస్థులు, డిపాజిట్లను తమవద్ద ఉంచుకునే బ్యాంకు గ్యారెంటీలను జారీచేయాలని వారు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాంకులకేకాదు.. కాంట్రాక్టు సంస్థలు, కంపెనీలకుకూడా బాధ్యత, భయం ఉంటాయని.. లేకపోతే తెలిసీ.. తెలియక జరిగే పొరపాట్లు, తప్పుల వల్ల బ్యాంకులు, సంస్థలు రెండూకూడా న్యాయపరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళక తప్పని పరిస్థితి తలెత్తుతుందని వారంటున్నారు.

చాలా కంపెనీలు, కాంట్రాక్టు సంస్థలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లకు వెళ్ళకతప్పని పరిస్థితి కలగడానికి కారణం ఇవేనని వారంటున్నారు. ఇలా అన్ని అంశాలను పరిశీలించిన తరువాతనే, సరిపోయినంత అస్థులు, డిపాజిట్లను దగ్గర పెట్టుకుని మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

సిండికేట్ అయితే ఇబ్బందులు తప్పవు.. 

ఒకవేళ కంపెనీ, కాంట్రాక్టు సంస్థకు సిండికేట్ కావడం వల్ల పని దక్కిందనుకుంటే.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. ప్రభుత్వాలు మారిన తరువాత.. ఇలా సిండికేటుగా ఏర్పడి ఇచ్చిన పనులపై కచ్చితంగా కేసులు, విచారణలు తప్పని పరిస్థితులే ఉన్నాయి. పైగా భారీగా ఆమ్యామ్యాలు ఇచ్చినట్టయితే.. పనులు సకాలంలో పూర్తికావు. నాణ్యత ఉండదు.

సబ్ కాంట్రాక్టర్లకు, వెండర్లకు బిల్లులు సకాలంలో చెల్లింపులు ఉండవు. ఇలా అయితే.. సంస్థ వృద్ధి మాట  అటుంచి.. అప్పుల్లోకి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. దీనితో సంస్థ, కంపెనీ దివాళా తీస్తుందని.. అది బ్యాంకుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. పనులు పూర్తిచేయడంలో జాప్యం ఎక్కువగా ఉన్నా, ఎలాంటి పనులు  గతంలో చేపట్టారనే అంశాలను పరిశీలించి బ్యాంకులు గ్యారెంటీ ఇవ్వాలని సూచిస్తున్నారు.

సదరు సంస్థలుక గ్యారంటీ ఇస్తే.. ఏమైనా రిస్క్ ఉంటుందా అనేదికూడా సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రిస్క్.. సదరు కంపెనీ, కాంట్రాక్టు సంస్థతోనేకాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలతోకూడా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మరవొద్దని సూచిస్తున్నారు.