calender_icon.png 21 January, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా మ్యాప్‌లో కెనడా, గ్రీన్‌ల్యాండ్

21-01-2026 12:26:12 AM

  1. ట్రంప్ సోషల్ మీడియా ‘ట్రూత్’లో ప్రత్యక్షం
  2. గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం చేసుకోకుండా వదలమని సంకేతాలు 
  3. అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం
  4. ‘నాటో’ దేశాల మద్దతు కోరుతున్న డెన్మార్క్

వాషింగ్టన్, జనవరి ౨౦: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాయ రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో ఆయన షేర్ చేసిన ఒక మ్యాప్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఆ మ్యాప్‌లో కెనడా, వెనిజులా, గ్రీన్‌లాండ్ దేశాలను అమెరికా భూభాగంలో అంతర్భాగమై ఉండటం, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో కలిసి ట్రంప్ గ్రీన్‌లాండ్ తీరంలో అమెరికా జెండాను పాతినట్లు ఉండటం కలకలం రేపింది.

అలాగే వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో కూర్చున్న ట్రంప్ వెనుక ఈ కొత్త మ్యాప్ కనిపించింది. ట్రంప్ ఎదుట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వంటి ‘నాటో’ నేతలు ఉండటం గమనార్హం. డెన్మార్క్ తన ఆధీనంలోఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను రక్షించుకునేందుకు ఇతర నాటో దేశాల మద్దతు కోరుతున్నది.  తన ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌పై తనకు పూర్తి నియంత్రణ కావాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న యూరోపియన్ మిత్రదేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తానని హెచ్చ రించడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.

ఏదేమైనా ట్రంప్ దూకుడు చర్యలు ప్రపంచ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయనేది వాస్తవం. అలాగే కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేస్తామని ట్రంప్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి కెనడా భారీగా రాయితీలు పొందుతున్నదని, ఆ దేశం స్వతంత్రంగా మనుగడ సాగించలేదని, కెనడా అందుకే అమెరికాలో విలీనం కావాలని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తమ దేశం పట్ల ట్రంప్ అవలంబిస్తున్న వైఖరిని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.