06-02-2026 12:00:00 AM
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్
నిజామాబాద్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) : ఇందూరు కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థుల గెలుపులో బీజేవైఎం కీలక పాత్ర పోషించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ బీజేవైఎం కార్యకర్తలకు కీలక బాధ్యతలు సూచించారు. భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జెన్ జెడ్ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ మాట్లాడుతూ రాబోయే ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేవైఎం కార్యకర్తలు, యువత క్షేత్రస్థాయిలో ఎలా పని చేయాలన్న అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ప్రతి బూత్ను బలపరచడం, యువతను ఓటింగ్ ప్రక్రియకు ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీ విజయానికి యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆయన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, రూ:4,000 నిరుద్యోగ భృతి, మహిళా యువతకు స్కూటీ, జాబ్ నోటిఫికేషన్లు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు.
హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, నేడు యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతుందని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, ఇందూరులో బీజేపీ బలోపేతానికి యువ మోర్చా శక్తి ప్రధాన ఆయుధం అని పేర్కొన్నారు. యువత ఉత్సాహం, క్రమశిక్షణతో ముందుకు సాగితే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలలో యువమోర్చ నాయకుల కు తగిన ప్రాధాన్యత ఇచ్చామన్నారు భవిష్యత్తు ప్రతి గెలుపులో ముందుండి నడిపించాల్సిన బాధ్యత యువమోర్చదే అని దినేష్ పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షులు వంశీ గౌడ్, శ్రీధర్ గౌడ్, ఐటీ సెల్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, విపుల్ రావు,వినోద్ రెడ్డి, మండల అధ్యక్షులు జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.