పాక్‌కు సవాలుగా బీఎల్‌ఏ
బలూచిస్థాన్‌లోని అమూల్యమైన సహజ వనరులపై కన్నేసిన పాకిస్థాన్ 1948లో తనలో వీలినం చేసుకుందని, ఇదే కోవలో కలత్, ఖరన్, లాస్ బెల్, మక్రాన్ రాచరిక రాజ్యాలను సైతం విలీనం చేసుకుందని బీఎల్‌ఏ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంత విమోచన సంస్థలు అనాదిగా శాంతియుతంగా, సాయుధ దళాలుగా ఏర్పడి పోరాడుతున్నాయని, అయినప్పటికీ తమకు విముక్తి కలగడం లేదని వాపోతున్నారు.
పాకిస్థాన్ నైరుతి ప్రాంతంలోని బలూచిస్థాన్ అనాదిగా పాక్ ప్రభుత్వానికి, పాక్ ఆర్మీకి కొరకరాని కొయ్యనే. పాకిస్థాన్‌లో 44 శాతం భూభాగం బలూచిస్థాన్ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ ఖరీదైన ఖనిజ, గ్యాస్, ఇతర తీరప్రాంత విలువైన నిల్వలు ఉన్నాయి. 25 కోట్ల పాకిస్థాన్ జనాభాలో సుమారు 4 శాతం.. అనగా లక్షరాలా 1.5 కోట్ల జనాభా బలూచిస్థాన్‌లో ఉంటుంది.
ఈ ప్రాంత సహజ వనరులను యథేచ్ఛగా పాకిస్థాన్ ప్రభుత్వం వినియోగించుకుంటుంది. కానీ.. బలూచిస్థాన్ అభివృద్ధిపై అక్కడి ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు. ఇక్కడి ప్రజలజకు రాజకీయంగా ప్రాధాన్యం లేదు. ఆర్థికపరంగానూ ఈ ప్రాంతం వెనుకబాటులోనే ఉంది. పాక్ ఆర్మీ బలూచిస్థానీలను అణచివేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నదని బలూచ్సిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఎన్నోసార్లు బాహాటంగా ప్రకటించింది.
1948లో తమ ప్రాంతాన్ని పాకిస్థాన్ బలవంతంగా విలీనం చేసుకున్నదని, నాటి నుంచి నేటి వరకు బలూచిస్థాన్ వివక్షకు గురవుతున్నది వాపోయింది. ఇక్కడ పేదరికం రాజ్యమేలుతోందని, అందుకే తమ ప్రాంతానికి పాక్ నుంచి స్వతంత్రం కల్పించాలని డిమాండ్ చేస్తున్నది.
గత కొన్నేళ్లుగా పాక్ ఆర్మీ బలూచ్ ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్దని. వారిని అన్ని విధాల అణచివేస్తున్నదని ఆరోపిస్తున్నది. తమ ప్రాంత స్వాతంత్య్రం కోసమే విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారని తెలిపింది. వారిని పాక్ భద్రతా దళాలు పొట్టనపెట్టుకుంటున్నాయని వాపోతున్నది.
అనాదిగా వెనుకబాటు..
ఏ ప్రాంతమైతే దీర్ఘకాలం పాటు అణచివేతకు గురవుతుందో.. అక్కడి ప్రజలు బాధాతప్త హృదయంతో పిడికిల బిగించి విప్లవ శంఖారావం పూరిస్తారు.. అనే చారిత్రక సత్యాన్ని బలూచ్‌వాసులు మరోసారి నిరూపిస్తున్నారు. వారికి దన్నుగా బీఎల్‌ఏ నిలిచి ఉద్యమాన్ని నడిపిస్తున్నది. పహల్గాం దాడి తర్వాత భారత్ ప్రతిష్ఠాత్మకంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
ఇదే అదునుగా బీఎల్‌ఏ కూడా మేల్కొని పాక్ భద్రతా దళాలు, లోకల్ పోలీసులను తరిమి తరిమి కొట్టింది. బలూచిస్థాన్‌లోని ప్రధాన నగరమైన క్వెట్టాను సైతం ఆక్రమించింది. ‘మా సహజ వనరులు మాకే చెందాలి.. మా ప్రాంతంలో పాలన మాదే కావాలి’ అని అక్కడి ప్రజానీకం నినదిస్తున్నది.
బలూచిస్థాన్ పక్షాన ఎవరు మాట్లాడినా పాక్ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నది. అలాంటి వారు “తీవ్రవాదులు” అని సంబోధిస్తున్నది. “విదేశీ ఏజెంట్లు” అని చిత్రించే ప్రయత్నం చేస్తున్నది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత బలూచిస్థాన్..
పాకిస్థాన్ వ్యాప్తంగా మొత్తం 39 పోలీస్ స్టేషన్లు, మిలటరీ క్యాంప్‌లపై బీఎల్‌ఏ బాంబులతో దాడిన చేసింది. ఆయా ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను బీఎఎల్‌ఏ కూడా సద్వినియోగం చేసుకుంటున్నది. పాక్ భద్రతా దళాలు/ప్రభుత్వ వ్యవస్థలపై దాడులు చేస్తూ ఆయా ప్రాంతాలను విజయవంతంగా తమ అధీనంలోకి తీసుకుంటున్నది.
గత కొన్ని రోజులుగా బలూచిస్థాన్‌లోని పాక్ భద్రతాదళాల క్యాంపులు లేదా స్థావరాలు లక్ష్యంగా బీఎల్‌ఏ, ఇతర సారూప్య గ్రూపులు దాడులు చేస్తున్నాయి. వాటిని సర్వ నాశనం చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఈ నెల 6న బీఎల్‌ఏ 14 మంది పాక్ భద్రతా సిబ్బందిని మట్టుపెట్టాయి. పాక్ ప్రభుత్వం మరోవైపు బలూచిస్థాన్‌లో అల్లర్లకు కారణం కేవలం 1,500 మంది బలూచ్‌వాసులేనని ప్రకటించింది.
బలవంతంగా విలీనమా?
బలూచిస్థాన్‌లోని అమూల్యమైన సహజ వనరులపై కన్నేసిన పాకిస్థాన్ 1948లో తనలో వీలినం చేసుకుందని, ఇదే కోవలో కలత్, ఖరన్, లాస్ బెల్, మక్రాన్ రాచరిక రాజ్యాలను సైతం విలీనం చేసుకుందని బీఎల్‌ఏ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంత విమోచన సంస్థలు అనాదిగా శాంతియుతంగా, సాయుధ దళాలుగా ఏర్పడి పోరాడుతున్నాయని, అయినప్పటికీ తమకు విముక్తి కలగడం లేదని వాపోతున్నారు.
బలమైన పాకిస్థానీ మిలటరీ ముందు తమ వంటి సాయుధ సంస్థలు ఓడిపోతున్నాయని, అయినప్పటికీ మడమ తిప్పకుండా తిరిగి పోరాడుతూ వస్తున్నామని చెప్తున్నారు. పాకిస్థాన్ తాజాగా చైనా అండతో చైనా-- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మిస్తున్నది. ఆ కారిడార్‌ను అడ్డుకునేందుకు సైతం బీఎల్‌ఏ పోరాటం చేస్తున్నది. ఆ పోరాటాన్ని అదుపు చేయడానికి పాకిస్థాన్ వాడని పద్ధతి లేదు.
చేయని మానవ హక్కుల ఉల్లంఘన లేదు. ఈ పోరాటంలో బలూచిస్థానీ సాయుధ మహిళలు కూడా నడుం బిగించారంటే, ఆ ప్రాంతంలో అణచివేత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క 2024లో జరిగిన బలూచిస్థానీ విమోచన పోరాటంలో పాక్ మిలటరీ 383 మంది ప్రాణాలు తీసింది.
మళ్లీ కాల్పులు జరిగితే..
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాటు బీఎల్‌ఏ దాడులను పాక్ తట్టుకోలేకపోతున్నది. ముందు చేసిన చారిత్రక తప్పిదాలకు పాక్ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నది. భారత్ వరుస దాడులను తట్టుకోలేకపోతున్నది. బీఎల్‌ఏ ఆక్రమణలను నిలువరించలేకపోతున్నద. ప్రజల తీవ్రమైన వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నది.
ఉగ్ర మూకల ఆధిపత్యాన్ని సైతం ఆపలేకపోతున్నది. చివకు భారత్ కాళ్లబేరానికి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ.. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించి భారత్ సరిహద్దుల్లో దాడులు చేస్తూ.. భారత్ సహనాన్ని పరీక్షిస్తున్నది.
మున్ముందు ఎస్-400 సుదర్శన చక్రతో పాటు బ్రహ్మోస్ క్షిపణుల తాకిడి తినే దిశగా ముందుకు వెళ్తున్నది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ తాత్కాలికమైందని, శాశ్వత శాంతి ఒప్పందం కాదని తెలివిలేని దాయాది అర్థం చేసుకోవాలి. యుద్ధం మళ్లీ ఖాయమైతే కేవలం కొన్ని గంటల్లో పాక్ భస్మంకాక తప్పదు.
కెప్టెన్, డాక్టర్
బుర్ర మధుసూదన్‌రెడ్డి






