చరిత్రలో బ్లాక్ డే
బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): 131 రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇండియా కూటమి వ్యతిరేకంగా ఓటు వేసి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారని, ఇది చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘోరమైన అపరాధాన్ని పార్టీలు చేశాయన్నారు. ఈ మేరకు లోక్‌సభలో వీగిపోయిన బిల్లుపై శుక్రవారం రాంచందర్‌రావు వీడియో విడుదల చేశారు.
దేశంలోని మహిళలకు రాజకీయ అధికారాన్ని ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తే, మహిళా సాధికారతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిందని విమర్శించారు. మహిళా లోకానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. మహిళలందరూ కాంగ్రెస్ పార్టీని శిక్షించాలని కోరారు. చారిత్రాత్మకమైన బిల్లుతో మహిళలు చట్టసభల్లో రాకుండా అడ్డుకుని, ఆ పాపాన్ని కాంగ్రెస్ మూటగట్టుకుందని తెలిపారు.






