దీవెన
మహా ప్రయాణాన్ని సాగించి సాగించి ప్రారంభ స్థానానికి చేరుకోవడం
గ్రహ గతుల జన్మాచారం!
ఆ గమనమే సృష్టికాధారం!
ఆవిరై
ఆకాశ సీమల ఎత్తుల పొత్తులను
అందుకునే
అంబుధి జలం
వర్షమై తిరిగి వారికి వేంచేయడం
ప్రకృతి స్వభావం!
నిసర్గ నియమ ప్రభావం!
ఈ పరిణామం అవని ఆస్తిత్వానికి ఆవశ్యక విధానం!
అనుపల్లవి ఒడి నుండి జనించి
పలు చరణాలతో పయనించే పాట
సాగి సాగి తుదకు
అంకురార్పణ జరిగిన
అంకానికే అరుదెంచడం
గీతం సహజ గుణం!
అదే దాని చక్కందనం!
అదే దానికి అక్కరైన నిబంధనం!
ఈ ధోరణులు
మనిషికి తగనివని నా
సూచనలు!
నేడు నేలపై, నింగిపై అద్భుతాలను ఆవిష్కరిస్తున్న
ఆధునికుడు
కదనాలలో పరులను కాల్చుకుంటూ, పాశవిక బాంబులను పేల్చుకుంటూ,
బతుకు బాటలను కూల్చుకుంటూ
విలయాలను సృజిస్తూ, సృజిస్తూ
ఒక నాడు కడకు తన
సమున్నత స్థితి సింహాసనము నుంచి
తూలి, కూలి
పునః తన పురావస్థకు..
తనదైన అతి ప్రాచీన అవతరణ
కాలం దిశకు...
వానర దశకు
చేర దలచాడా?
దిగజార దలచాడా?
ఈ తిరోగమనం
ఎంత ఘోర పతనం!
ఎంత ప్రమాదకరం!
ఎంత అయుక్తం!
ఎంత అవమానకరం!
వేడుకతో
రంగుల రాట్నమెక్కి
ఎక్కిన చోటనే వేదనతో దిగే పిల్లల్లా పెద్ద మనుష్యులూ మార దలచారా?
అలా కాకూడని నా ప్రగాఢ కామన! కారాదని నా అక్షరాల దీవెన!






