మార్క్‌ఫెడ్ ఎఫెక్ట్.. మార్కెట్లు బంద్
మహబూబాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా రైతుల పరిస్థితి మారింది. రైతులు పండించిన మొక్కజొన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలను పక్షం రోజుల క్రితం ప్రారంభించారు.
మహబూబాబాద్, కేసముద్రం మార్కెట్ల పరిధిలో మరెక్కడ కూడా మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో రైతులంతా వేల కొలది బస్తాల మక్కలను విక్రయానికి తేవడంతో మార్కెట్ యార్డులు పూర్తిగా మక్కలతో నిండిపోయాయి. దీనితో ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఆయా మార్కెట్లలో ఆటంకంగా మారింది. ఎకరాల యార్డులు పూర్తిగా మార్క్ఫెడ్ సంస్థ ద్వారా విక్రయించడానికి రైతులు తెచ్చిన మక్కలతో నిండిపోవడం వల్ల మిర్చి, పత్తి, పసుపు, అపరాలు, ధాన్యం విక్రయానికి స్థలం లేకుండా పోయింది.
అలాగే యార్డుల్లోని అన్ని షెడ్లు మక్కల తోనే నిండిపోయాయి. పూర్తిగా యార్డు మార్క్ ఫెడ్ సంస్థ కొనుగోలు చేసిన, కొనుగోలు చేయాల్సిన మక్కలతో నిండిపోవడంతో ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళను మార్కెట్లోకి అనుమతించే పరిస్థితి లేక, ఆయా మార్కెట్లకు ఐదు రోజులపాటు బంద్ ప్రకటించారు.
యార్డులో ఉన్న పత్తి, మిర్చి, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు ప్రత్యేకంగా కేటాయించిన షెడ్లతోపాటు ఓపెన్ యార్డు లో సైతం మార్క్ ఫెడ్ సంస్థ కొనుగోలు చేసిన మక్కలు ఉన్నాయని, కొనుగోళ్లు పూర్తి చేసి, కాంటాలు పెట్టిన మక్కలు వేల బస్తాలకు పైగా నిల్వ ఉండగా, కొనుగోలు చేయాల్సినవి కూడా వేల బస్తాలు ఉన్నాయి.
ఇవన్నీ క్లియర్ చేస్తే తప్ప మార్కెట్లను ఓపెన్ చేసే పరిస్థితి లేదు. మార్కెట్లో ప్రస్తుతం మార్క్ ఫెడ్ నిర్వహణలో కూడా నిత్యం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక కేసముద్రం మార్కెట్లో రైతులు తరచుగా ఆందోళనలు నిర్వహిస్తుండడంతో ఏకంగా మార్కెట్లోనే పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఎస్ ఐ క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కార్యదర్శి అమరలింగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న 40 వేల బస్తాల కొనుగోళ్లు పూర్తి చేయడానికి వారంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు.
కొత్త ధాన్యం రాక.. మిల్లుల వద్ద కొనుగోల్లు
యాసంగి సీజన్లో పండించిన ధాన్యం విక్రయించడానికి రైతులు మార్కెట్లకు తెస్తున్నారు. ఈ క్రమంలో సెలవులు, మార్క్ఫెడ్ కొనుగోళ్ల స్తంభన వల్ల మిల్లర్లు, ట్రేడింగ్ కంపెనీల వద్ద ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. అలాగే ప్రస్తుతం మార్కెట్లు బందు చేయడం వల్ల మక్కజొన్నలను సైతం ప్రైవేట్ ట్రేడర్లకు తక్కువ ధరకు విక్రయిస్తూ ‘మద్దతు’ ధర కోల్పోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యక్ష పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తూ రైతులకు మేలు చేసే విధంగా కేసముద్రం, మహబూబాబాద్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాయి.
ఈ మార్కెట్లలో రైతులు పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఇతర వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి ఆటంకంగా మారింది. ఇకముందు అధికారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను మార్కెట్లలో ఏర్పాటు చేయకుండా ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన అవసరం ఉంది.
మార్కెట్ తెరిచేందుకు చర్యలు
కేసముద్రం మార్కెట్లో పేరుకుపోయిన మార్క్ఫెడ్ మక్కలను, ఒకటి రెండు రోజుల్లో క్లియర్ చేసి, వెంటనే మార్కెట్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
గంట సంజీవరెడ్డి,
మార్కెట్ కమిటీ చైర్మన్






