calender_icon.png 18 November, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తత అంచుల్లో

17-11-2025 01:43:13 AM

చిన్నప్పుడు చల్లని వెన్నెల రాత్రుల్లో కనురెప్పలు కాస్త వాలి సోలి పోగానే, రూపంలేని, నిద్రరాని వేటగాడి బాణాలు వీపుపై తగిలి కమిలి కంది పోయేది.

అంతసేపు నిశ్శబ్దంగా మత్తుగా పడుకున్న గంట, తాటాలున ఠంగు ఠంగు మని మోగినట్టు, నిలకడ దుప్పటి కప్పుకున్న ఒంట్లో చలనం పుట్టి, గుడ్లగూబలా కనుగుడ్లు విప్పార్చి చుట్టూ పరికించేది మనసు.

ఎక్కడున్నానో తెలియని దిక్కుతోచని తనంతో, ముసురుపట్టి మసకబారిన వేదన మబ్బులు కమ్మేసి,ఏదో ప్రమాదం తరుముకొస్తుందన్న సంకేతాలతో, అల్లకల్లోలంగా కళ్లు చెమ్మగిల్లేవి.

గుండె వేల కాంతి సంవత్సరాల వేగంతో ప్రయాణించే రాకెట్లా లబ్‌డబ్ మని కొట్టుకుంటూ..

నిశ్చలంగా ఉన్న వస్తువుల్లో కదలిక వచ్చి చిత్రవిచిత్ర ఆకృతులు నీలాకాశపు మేఘాల్లో పుట్టుకొచ్చి భయపెట్టేవి.

ఎక్కడి నుంచో సుడిగాలితో కొట్టుకొచ్చిన శబ్దాలు ఎద సాలెగూడులో కంపనాలు రేపి తుర్రుమని పారిపోయేవి.

రాకాసి అల వెయ్యి చేతుల్తో చెవుల్లోకి దూరి తీరాన్ని వెనక్కుముందుకు లాగుతూ ఎడతెగని హోరు పుట్టించేది.

ప్రశాంతం నటిస్తున్న గదుల్లోని గోడలు రాబోతున్న పెద్ద యుద్ధానికి సన్నద్ధం అవ్వాలని ఆజ్ఞాపించేవి.

ఆనాడు నన్ను మండించిన ఆ ఆత్రం, ఇప్పుడు చల్లారిన శ్మశానంలా కనిపిస్తుందేంటో?

అంచు పగిలిన కప్పులో కమ్మదనాన్ని పట్టుకున్నా,  ఏ క్షణంలోనైనా పగిలిపోతుందోమోననే భయంలా..,

ఎప్పుడు పేలిపోతుందో తెలియనిడిప్యూజ్ చేయని బాంబును చేతిలోకి తీసుకున్న ఆందోళనలా..,

ఉండేది నా అతి అప్రమత్తత! కానీ నేడు... పట్టు పట్టరాని వాటిని వదిలిపెట్టే కనికట్టు,

గుట్టుగా, గుసగుసలు పెట్టి, గట్టెక్కించినంత తేలిగ్గా, మార్చేసింది కాలం.

ఇప్పుడు వెంటాడి వేధించి ఆలోచనలు నిర్వికార నిర్ముక్త గమనం వైపే!