14 July, 2026 | 3:55 AM

బాబీ లీలలు మరెన్నో!

14-07-2026 12:19 AM
  1. ట్రాన్‌ఫార్మర్ల ఏర్పాటులో అన్నీ అవకతవకలే 
  2. బాబీ తప్పిదాలు గురించి చెపుతున్న బాధిత ప్రజలు
  3. స్పందించని సింగం వెంకటేశం 
  4. మౌనం వహించిన ఏఈ

గజ్వేల్, జూలై 13: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కాశిరెడ్డిపల్లి, వరదరాజపూర్ గ్రామాల్లో అదనపు లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ బాబి రెండు గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు కోసం భారీగా వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల విజయక్రాంతి దినపత్రికలో ‘ఆ రెండు గ్రామాల్లో అంతా ఆర్టిజన్ బాబీ ఇష్టమే’ శీర్షికన వెలువడిన కథనానికి ప్రజలు స్పందించి, కాశిరెడ్డిపల్లి, వరదరాజపూర్ గ్రామాల్లో ఆర్టిజన్ బాబి చేసిన అక్రమ వసూళ్లను వెల్లడిస్తున్నారు.

కాశిరెడ్డిపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం  రైతుల నుంచి రూ.3.50 లక్షలు వసూలు చేశారన్నది వాస్తవమని రైతు గున్నారం రాణి వద్ద పనిచేస్తున్న నీలకంఠం వెల్లడించారు. బండారు ఎల్లయ్యతో పాటు గ్రామానికి చెందిన మరో ఆరుగురు రైతులతో కలిసి ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖా స్తు చేయగా బాబి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయకపోగా డీడీలను రద్దు చేయించాడని చెప్పారు.

ఆవేదనకు గురైన బండారి ఎల్లయ్య గుండెపోటుతో మృతి చెందాడని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామంలో బాబిని గ్రామస్థులు బంధించారు. వరదరాజపూర్‌లో కూడా బాబి అక్రమ వసూళ్ల పాల్పడ్డాడని, ౨ స్తంభాలు పాతడానికి రూ.2 లక్షలు వసూలు చేశాడని, సబ్ డివిజన్ డివిజన్, జిల్లా అధికారులను కోరినా చర్యలు తీసుకోలేదని వరదరాజపూర్‌వాసులు వాపోయారు. 

డీడీలు కట్టించి మోసం

కాశిరెడ్డిపల్లిలో గన్నారం రాణి వ్యవసాయ భూమిలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంలో బాబి చాలా అవకతవకలకు పాల్పడినట్టు తెలుస్తున్నది. గున్నారం రాణికి వ్యవసాయ భూమి (సర్వే నెంబర్ 242ఇ /1/ఏ)లో బోరుబావి ఒకటి ఉండగా, ఆమెతో రెండు డీడీలు కట్టించారు. గున్నారం రాణి వ్యవసాయ భూమికి కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగం వెంకటేశం సర్వే నెంబర్ 404/ఇ/2 లోని వ్యవసాయ భూమి కోసం మరో డీడీ కట్టించారు.

ఇదే క్రమంలో సర్వే నెంబర్ 505 వ్యవసాయ భూమిలో ఉన్న భోగ నరేందర్ బోరుబావికి అప్పటికే విద్యుత్ సేవలు పొందుతుండగా, దీనికోసం చెల్లించిన డీడీని కూడా ట్రాన్స్‌ఫార్మర్ నివేదికలో చేర్చారు. ఒక్కో డీడీ రూ.4,950 చొప్పున కట్టింది మూడు డీడీలు అయినా భోగ నరేందర్ డీడీని కూడా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు నివేదికలో చేర్చారు.

ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నివేదికలు సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ, ఏడీల పర్యవేక్షణలో  సిద్ధం చేయాల్సి ఉండగా అధికారులు వీటిని పట్టించుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంలో సహకరించారంటే బాబీకి వారి అండ కూడా ఉన్నట్లు తేటతెల్లమవుతుంది. 

స్పందించని సింగం వెంకటేష్

కాశిరెడ్డిపల్లిలో గన్నారం రాని వ్యవసాయ భూమిలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి గ్రామానికి చెందిన సింగం వెంకటేష్ ఆర్టిజన్ బాబీతో కలిసి రూ.3.50 లక్షలు తీసుకున్నట్లు ప్రచురించిన వార్తా కథనంలో వాస్తవం లేదని సింగం వెంకటేష్ ఆరోపించారు. కాగా సింగం నీలకంఠం తాను గ్రామంలో అందరి ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, వెంకటేష్ కూడా తీసుకోలేదని చెప్పాలని కోరితే స్పందించకుండా తప్పించుకోవడం సింగం నీలకంఠం ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది. సింగం వెంకటేష్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. 

అక్రమాలపై విచారణ చేపడతాం: ఏఈ

కాశిరెడ్డిపల్లి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు  కోసం రూ. 3.50 లక్షలు వసూలు చేసినట్టు తమ దృష్టికి రాలేదని విద్యుత్ శాఖ మర్కుక్ మండల ఏఈ సుధీర్ స్పష్టం చేశారు. అలాగే ఆర్టిజన్ బాబీపై ప్రజలు చేస్తున్న ఆరోపణలపై కూడా విచారణ చేపడతామని తెలిపారు.

మాకు న్యాయం చేయాలి..

ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎంతో కష్టమని రైతులకు చెప్పి రైతుల నుండి వేలు, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా రు. అధికారులు అండ లేకపోతే వారు ఎందుకు వసూలు చేస్తారు. బోర్ల దగ్గరికి విద్యుత్ సరఫరా చేయడానికి స్తంభాలు వేయమన్నా నా భర్తతోపాటు మరి కొంతమంది వద్ద రూ.90 వేలు బేరం తీసుకున్నారు. దీనిలో రూ.10 వేలు బాబీ తండ్రి ఫోన్‌పేకు పంపించి మిగతా రూ. 80వేలు నగదు ఇచ్చాం. గతంలో మేము కట్టిన డీడీలు ఎందుకు క్యాన్సిల్ అయ్యాయో, ఆ డబ్బు లు ఏమయ్యాయో ఇంకా చెప్పడం లేదు.  డబ్బులు చెల్లిస్తేనే ఏ పనైనా అవుతుందా. మాకు న్యాయం చేయాలి.

 బండారి బాలమణి 

(మృతి చెందిన ఎల్లయ్య భార్య)

3.80 లక్షలు ఇచ్చాను

సింగం వెంకటేశం ద్వారా ఆర్టిజన్ బాబీకి రూ.3.80 లక్షలు నేనే ఇచ్చాను. అంతకుముందు ఏఈ అడిగితే ముందు కలిసిన వారిని కలువమన్నారు. గత్యంతరం లేక డబ్బులు ఇచ్చాను. అప్పటివరకు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయలేదు. తెలిసినవారే అని నమ్మాను. కానీ అప్పట్లో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు రూ.30వేలు మాత్రమే అవుతుందని తర్వాత తెలిసి మోసపోయానని గ్రహించాను. మా యజమాని, మా బంధువులు, మా ఊరి వాళ్లు నన్ను ఇప్పటికీ తిడుతున్నారు.

 నీలకంఠం, కాశిరెడ్డిపల్లి