ఇసుక, మొరం రవాణా ఆకస్మిక పరిశీలన
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, జూలై 13 (విజయక్రాంతి): జిల్లాలో నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను పారదర్శకంగా, వేగంగా, సులభతరంగా అందించేందుకు గాను రూపొందించిన ఈ - సాండ్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం... చౌడారం మోడల్ పాఠశాల సందర్శనలో భాగంగా... దారి మధ్యలో అటు వైపుగా వెళ్తున్న ఇసుక, మొరం ట్రాక్టర్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, వారి దగ్గర ఆన్లైన్ కూపన్ లు ఉన్నాయా? లేవా? అని పరిశీలించారు.
జిల్లాలో పలు నిర్మాణాలకు అవసరమైన ఇసుక, మొరం వంటి ఖనిజాలను ప్రజలు సులభంగా బుక్ చేసుకునే విధంగా ఈ - సాండ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు... ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అక్రమ ఇసుక, మొరం రవాణాను అరికట్టడం, ప్రజలకు పారదర్శకంగా ఖనిజాల సరఫరా చేయడం ఈ - సాండ్ వ్యవస్థ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు నాణ్యమైన ఇసుకను నిర్ణీత ధరలకు అందించడంతో పాటు అక్రమ రవాణాపై సమర్థవంతమైన నియంత్రణ కూడా ఉండాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.






