అనురూప్ కుటుంబానికి అండగా ఉంటాం
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అమెరికా నుంచి స్వగ్రామం కవాడిపల్లికి మృతదేహం
అబ్దుల్లాపూర్ మెట్, జూన్ 9 : అమెరికాలోని సెబాన్ నదిలో ముగ్గురిని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అనురూప్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి లు అన్నారు. అనురూప్ రెడ్డి మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామమైన కవాడిపల్లి చేరుకోవడంతో సమాచారం తెలుసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, మందుల సామెలు అనురూప్ మృద్దేహానికి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. అనురూప్ రెడ్డి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. యువకుడి త్యాగానికి గుర్తుకు సీఎం రేవంత్ రెడ్డి పంపిన కమెండేషన్ లెటర్ ను అనురూప్ కుటుంబసభ్యులకు అందజేశారు. అనురూప్ సమయస్ఫూర్తితో ముగ్గురిని కాపాడి.. తాను ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరమన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కవాడిపల్లి విషాద ఛాయలు..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి చెందిన కోడూరు రాజేందర్రెడ్డి, దుర్గాభవాని దంపతుల చిన్న కుమారుడు అనురూప్ రెడ్డి రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. యూనివర్సీటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశాడు.
వారం రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా గత నెల 30న స్నేహితులతో కలిసి లూసియానాలోని టోరోడో పార్కు వద్ద సెబాన్ నది వద్దకు వెళ్లారు. నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి.. అనురూప్ నదిలో నుంచి బయటకు వస్తుండగా ఓ వల అతడి కాళ్లకు చుట్టుకోవడంతో నీటమునిగి అనురూప్ ప్రాణాలు కోల్పోయారు. 10 రోజుల తర్వాత అనురూప్ మృతదేహం కవాడిపల్లికి చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






