చీకటిలో చీర్యాల వాసులు!
- పట్టాలు, ఇంటి నంబర్లు ఉన్నా చీకటిలోనే మగ్గుతున్న డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు
- అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం
- కీసర సర్కిల్ పరిధిలో ‘డబుల్’ కష్టాలు
కుషాయిగూడ, జూన్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చింది. పట్టాలు, ఇంటి నంబర్లు కూడా ఇచ్చింది. కానీ, కనీస సౌకర్యం కరెంట్ మాత్రం ఇవ్వలేదు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో లబ్ధిదారుల దుస్థితి ఇది. సుమారు ఏడాది క్రితం లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించి పట్టా పత్రాలు, ఇంటి నంబర్ల ప్లేట్లు అధికారులు అందజేశారు. కానీ విద్యుత్ కనెక్షన్ కోసం స్థానిక ఏఈ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
చీకట్లోనే జీవనం..
ఇళ్లకు మీటర్లు లేకపోవడంతో రాత్రిపూట లాంతర్లు, కొవ్వొత్తుల వెలుతురులోనే జీవనం సాగిస్తున్నారు. పిల్లల చదువులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వంట, ఇతర గృహ అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించింది. కానీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులు మాత్రం సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. వెంటనే స్పందించి చీర్యాల డబుల్ బెడ్రూమ్ కాలనీలోని అన్ని ఇళ్లకు విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కలెక్టర్, విద్యుత్ ఉన్నతాధికారులను కోరుతున్నారు.
ఫైలు పెండింగ్లో ఉంది అంటున్నారు..
ఇల్లు ఇచ్చారు, పట్టా ఇచ్చారు, నంబర్ ఇచ్చారు. కానీ, కరెంట్ మీటర్ మాత్రం ఇవ్వడం లేదు. ఏఈ మురళి సార్ని ఎన్నిసార్లు అడిగినా ’ఫైలు పెండింగ్లో ఉంది అని చెప్పి పంపిస్తున్నారు. ఇకనైనా కరెంటు కనెక్షన్ ఇవ్వాలి.
దేవిక, డబుల్ బెడ్రూం లబ్ధిదారురాలు
సమస్య నా దృష్టికి రాలేదు..
కీసర డబల్ బెడ్‌రూమ్‌లలో కరెంటు రాకపోవడంపై కీసర ‘విజయక్రాంతి’కి వివరణ ఇచ్చారు. కీసర ఏఈగా పనిచేస్తున్న మురళీకృష్ణ సెలవుల్లో వెళ్ళాడని తాను ఇంచార్జిగా వ్యవహరిస్తున్నా. డబుల్ బెడ్ రూమ్‌లో విద్యుత్తు లేని విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. సమస్యకు పరిష్కారం కనుక్కుంటా.
ఫణీంద్ర, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్






