‘అయోధ్య’ ట్రస్ట్ తొలి సీఈవోగా జితేంద్ర మిశ్రా
- 5,585 దరఖాస్తులను ఏఐ,మాన్యువల్‌గా పరిశీలించి.. మిశ్రా పేరు ఖరారు
- ‘ఆపరేషన్ సింధూర్’లో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నాయకత్వం
- 39 ఏళ్లపాటు వాయుసేనలో సేవలు
లక్నో, సెప్టెంబర్ 2: ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindhur) సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నాయకత్వం వహించిన ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) జితేంద్ర మిశ్రాను అయోద్య రామాలయ నిర్వహణ, కార్యకలాపాలను పర్యవేక్షించే ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు తొలి సీఈఓగా బుధవారం నియమించినట్లు ట్రస్ట్ అధికారులు తెలిపారు. 5,585 దరఖాస్తుల నుంచి ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థుల జాబితాలో మిశ్రా పేరు ఖరారైంది. ఆలయ విరాళాల దుర్విని యోగం ఆరోపణల నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ నేతృత్వంలోని ఈ సెర్చ్ కమిటీలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, మాజీ శాస్త్రవేత్త సురేష్ హవారే సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన తుది నివేదికను మంగళవారం ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరికి సమర్పించింది. అభ్యర్థుల నాయకత్వ లక్షణాలు, నిర్వహణ నైపుణ్యం, నిజాయితీ, దూరదృష్టిని అంచనా వేసిన తర్వాత ‘అత్యంత అర్హత కలిగిన ముగ్గురు నిపుణులను’ సిఫార్సు చేసినట్లు కమిటీ కార్యదర్శి సమీర్ పాండా తెలిపారు.
విరాళాల చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ సమావేశం కావడం ఇది మూడవసారి. సీఈఓ ఎంపిక ప్రక్రియలో కృత్రిమ మేధస్సు(ఏఐ) సహాయంతో కూడిన పరిశీలనతో పాటు మాన్యువల్ (ప్రత్యక్ష) అంచనా కూడా జరిగిందని ట్రస్ట్ అధికారులు తెలిపారు. వచ్చిన 5,585 దరఖాస్తులలో, 3,577 మంది అభ్యర్థులు 600 మార్కుల విధానం ఆధారంగా మూల్యాం కనం కోసం వివరాలను సమర్పించారు. తదుపరి దశలో, 470 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 108 మంది అభ్యర్థులను వర్చువల్ ఇంటరాక్షన్ల కోసం ఎంపిక చేశారు.
ఆ తర్వాత ఆగస్టు 11 మరియు 12 తేదీలలో అయోధ్యలో 16 మంది అభ్యర్థులను ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాకు చెందిన మిశ్రాకు ‘ఆపరేషన్ సింధూర్’లో ఆయన పోషించిన పాత్రకు ‘సర్వోత్తమ యుద్ధ సేవా పతకం’ లభించింది.
తన సుదీర్ఘ సైనిక సేవా కాలంలో ఆయనకు ‘అతి విశిష్ట సేవా పతకం’ ‘విశిష్ట సేవా పతకం’ కూడా లభించాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1986 డిసెంబర్ 6న భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా నియమితులైన మిశ్రా, 2026 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసే ముందు 39 సంవత్సరాలకు పైగా సేవలందించారు.






