13-05-2025 02:20:03 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)కి ఓ బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కోల్ కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సోమవారం రాత్రి వాష్‌రూమ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు అమర్చారని బెదిరింపు వచ్చింది. అది ఎప్పుడైనా పేలిపోతుందని రాసి ఉంచడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాష్‌రూమ్‌లో టిష్యూ పేపర్‌పై ఆ నోట్‌ను చూసిన సిబ్బంది శంషాబాద్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు. ఆర్జీఐఏ అధికారులు వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌లను రంగంలోకి దింపి విమానం ఆర్జీఐఏలో ల్యాండ్ అయిన వెంటనే తనిఖీ చేశారు.
విమానాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు ప్రయాణీకుల భద్రత కోసం అధికారులు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కూడా ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో, ప్రయాణీకులకు అవసరమైన ఉపశమనం కలిగించే నకిలీ సమాచారం ఇది అని అధికారులు ప్రకటించారు. గంటకు పైగా, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న దృశ్యాలను చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కానీ అధికారులు అది నకిలీ నోట్ అని ప్రకటించడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. శంషాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. శ్రీనివాస్ రావు వాష్‌రూమ్‌లో దొరికిన నోట్ గురించి స్పందించారు. ఇది విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులలో ఒకరి పనే అయి ఉండవచ్చని, ప్రయాణీకుల జాబితా సహాయంతో దీని వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.