ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు
14-12-2024 12:58 AM
ముంబై, డిసెంబర్ 13: వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇటీవల సర్వసాధారణమైంది. తాజాగా ఆర్బీఐ కార్యాలయానికి సైతం బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందర్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముంబైలో ఉన్న ఆర్బీఐ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తామని కొందరు ఆగంతకులు శుక్రవారం మెయిల్ చేశారు. అది కూడా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మెయిల్‌కు రావడం సంచలనంగా మారింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబ్, డాగ్ స్కాడ్ బృందాలు కార్యాలయానికి చేరుకొని క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. ఈ మెయిల్ రష్యన్ భాషలో వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఏకంగా ఆర్బీఐ గవర్నర్‌కే మెయిల్ రావడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






