భారతీయులకు అమెరికాలో ‘బహిష్కరణ’ ముప్పు!
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్రమ వలసలను అరికడతానని వాగ్దానం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత.. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారుల జాబితాను రూపొందించే పనిలో పడ్డారు. కాగా 18 వేల మంది ప్రవాస భారతీయులు అమెరికా నుంచి బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారికి సంబంధించి యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇటీవల గణాంకాలు విడుదల చేసింది. మొత్తంగా 14.15 లక్షల మంది ఈ జాబితాలో ఉన్నారు. 2,61, 651 మందితో హోండరస్ మొదటిస్థానంలో నిలవగా, గ్వాటెమాలా నుంచి రెండున్నర లక్షల మంది ఉన్నారు. మెక్సికో, ఎల్ సాల్వెడార్ దేశాలకు చెందిన వారు కూడా అధికంగా ఉన్నారు. ఈ జాబితాలో 17,940 మంది భారతీయులు కూడా ఉన్నట్లు ఐఈసీ నివేదిక పేర్కొంది.






