14 May, 2026 | 3:30 PM

బోనాల పండుగ ఘనంగా జరగాలి

21-06-2024 12:24 AM

అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు

ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుపుకుంటున్న బోనాల ఉత్సవాలు గతంలో కంటే ఘనంగా జరిగేలా చూడాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలపై జిల్లా స్థాయి అధికారులతో  మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో మొ త్తం మూడు వేలకు పైగా దేవాలయాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేవాలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈసారి దేవాలయాలకు ఇచ్చే డబ్బులు పెంచేవిధంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధ్వర్యంలో సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

నగరంలో ఉన్న 28 ముఖ్యమైన దేవాలయాలకు ప్రజాప్రతినిధులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని మంత్రి తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో గతంలో కంటే ఎక్కువగా భక్తులు బోనాల ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. శానిటేషన్ విషయంలో జీహెచ్ ఎంసీ అధికారులు జాగ్రత్తగా ఉండాలని, మంచినీటి విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రధానమైన దేవాలయాల్లో హెల్త్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. సమావే శంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఆమ్రపాలి, అడిష నల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, అడిషనల్ కలెక్టర్ హేమంత్‌కేశవ్‌పాటిల్ పాల్గొన్నారు.