నల్లకోటు ధరించిన ఎంపీ రఘునందన్ రావు
అరెస్టయిన పార్టీ కార్యకర్తల పక్షాన కోర్టుకు హాజరు
మెదక్, జూన్ 20 (విజయక్రాంతి): ఎంపీ రఘునందన్ రావు నల్లకోటు ధరించి గురువారం మెదక్ కోర్టుకు హాజరయ్యారు. మెదక్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించి అరెస్టయిన బీజేపీ కార్యకర్తల బెయిల్ విషయమై కోర్టులో వాదనలు వినిపించారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే మెదక్ పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడి ఉండేది కాదని కోర్టుకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టయిన కార్యకర్తల పక్షాన నిలబడేందుకు తాను నల్లకోటు ధరించినట్లు తెలిపారు. బెయిల్‌పై తీర్పును న్యాయమూర్తి ఈ నెల 21(శుక్రవారం)కి వాయిదా వేసినట్లు చెప్పారు.
సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో భేటీ..
మెదక్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు గురువారం విజ్ఞప్తి చేశారు. తూప్రాన్ సమీపంలోని ఏదుల నాగులపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, సిద్దిపేట నుంచి పెద్దపల్లి వరకు, పటాన్‌చెరు నుంచి అక్కన్నపేట, మెదక్ వరకు రైల్వేలైన్ పొడిగించాలని కోరారు. అలాగే మెదక్, సిద్దిపేట నుంచి తిరుపతి వరకు రైలు ఏర్పాటు చేయడంతో పాటు పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు.






