16 July, 2026 | 10:32 AM

బౌలర్లు భళా

18-04-2024 02:01 AM

ఇషాంత్, ముఖేశ్ విజృంభణ

బ్యాటర్లు శాంతించారు.. బౌలర్లు విజృంభించారు!

గత మూడు రోజులుగా బ్యాటర్లు దంచికొడుతుంటే.. సరైన లెంగ్త్ దొరక్క సతమతమైన బౌలర్లు ఎట్టకేలకు సత్తాచాటారు. ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ తనలో పస తగ్గలేదని నిరూపించుకుంటే.. ముఖేశ్ కుమార్ తానేం తక్కువ కాదని అతడికి అండగా నిలిచాడు. ఫలితంగా సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ 89 పరుగులకు ఆలౌటైంది. అనంతరం గుజరాత్ బౌలర్లు కూడా గట్టిగానే ప్రయత్నించినా.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో ఢిల్లీ అలవోకగా విజయం సాధించింది. మూడు రోజులుగా భారీ స్కోర్ల మ్యాచ్‌లను ఆస్వాదించిన అభిమానులకు ఈ సారి బౌలర్లు అలరించారు. రెండొందలు కొట్టడం ఇంత సులువా అన్నట్లు.. బ్యాటర్లు సాగిస్తున్న విధ్వంసకాండకు ఢిల్లీ బౌలర్లు అడ్డుకట్ట వేశారు.

అహ్మదాబాద్ : బ్యాటర్ల హవా సాగుతున్న ఐపీఎల్లో బౌలర్లు విజృంభించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయం నమోదు చేసుకుంది. బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (24 బంతుల్లో 31; 2 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (8), వృద్ధిమాన్ సాహా (2), సాయి సుదర్శన్ (12), డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్  (8), రాహుల్ తెవాటియా (10), షారుక్ ఖాన్ (0) విఫలమయ్యారు. తొలి ఓవర్ నుంచే కచ్చితత్వంతో కట్టిపడేసిన ఢిల్లీ బౌలర్లు.. గుజరాత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయారు.

ముఖేశ్ కుమార్ 3, ఇషాంత్, స్టబ్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం చేజింగ్‌లో ఢిల్లీ చెలరేగిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువ ఓపెనర్ మెక్‌గుర్క్ (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. అభిషేక్ పొరెల్ (15; 2 ఫోర్లు, ఒక సిక్సర్), హోప్ (19; ఒక ఫోర్, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (16 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు, జాన్సన్, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. వికెట్ల వెనుక అద్భుత ప్రదర్శనతో రెండు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు రెండు స్టంప్ ఔట్‌లు చేసిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

మ్యాజిక్ స్పెల్..

అలవోకగా భారీ స్కోర్లు నమోదవుతున్న ఐపీఎల్లో.. లో స్కోరింగ్ మ్యాచ్ దర్శనమిచ్చింది. హైదరాబాద్, బెంగళూరు.. కోల్‌కతా, రాజస్థాన్ మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారితే.. గుజరాత్, ఢిల్లీ పోరులో వికెట్ల వేట సాగింది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రెండో ఓవర్‌లో గిల్‌ను బుట్టలో వేసుకొని వికెట్ల పతనానికి తెరతీశాడు. అప్పటికే రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద ఉన్న గిల్ మరో షాట్ ఆడబోయి పృథ్వీ షా చేతికి చిక్కాడు. ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. సాహాను ముఖేశ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. సాయి సుదర్శన్ రనౌట్ అయ్యాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన మిల్లర్‌ను కూడా ఔట్ చేసిన ఇషాంత్.. గుజరాత్ నడ్డి విరిచాడు. అభినవ్ మనోహర్, షారుక్ ఖాన్ ఇలా వచ్చి అలా వెళ్లగా.. ఆఖర్లో రషీద్ ఖాన్ కాస్త పోరాడటంతో టైటాన్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్: 17.3 ఓవర్లలో 89 (రషీద్ 31; ముఖేశ్ 3/14, ఇషాంత్ 2/8), 

ఢిల్లీ: 8.5 ఓవర్లలో 92/4 (మెక్‌గుర్క్ 20, హోప్ 19; సందీప్ 2/40). 

పాయింట్ల పట్టిక 2024

జట్టు మ్యా గె ర.రే పా

రాజస్థాన్ 7 6 1 0.67 12

కోల్‌కతా 6 4 2 1.39 8

చెన్నై 6 4 2 0.72 8

హైదరాబాద్ 6 4 2 0.50 8

లక్నో 6 3 3 0.03 6

ఢిల్లీ 7 3 4 6

గుజరాత్ 7 3 4 6

పంజాబ్ 6 2 4 4

ముంబై 6 2 4 4

బెంగళూరు 7 1 6 2

నోట్: మ్యా గె 

ఓ ర.రే పా