కుమారుడిని తప్పించాలనుకొని..
పూణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
న్యూఢిల్లీ, జూన్ 1: పుణెలో ఓ మైనర్ మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపి ఇద్దరు టెకీల మృతికి కారణమైన కేసులో బాలుడి తల్లిని కూడా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో బాలుడు మద్యం తాగి ఉన్నాడా లేదా అని నిర్ధారించేందుకు బ్లడ్ టెస్ట్ నిర్వహించాల్సి ఉండగా.. బాలుడి రక్తానికి బదులుగా ఆమె తన రక్తాన్ని ల్యాబ్‌కు పంపిందని పోలీసులు నిర్ధారించారు. అందుకే మొదటగా బ్లడ్ టెస్ట్ నిర్వహించినప్పుడు బాలుడి రక్తంలో ఆల్కహాల్ లేదనే రిజల్ట్ వచ్చిందని వెల్లడించారు.
ఆమె తన కుమారుడిని కేసు నుంచి బయటపడేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేసిందని పోలీసులు వివరించారు. ప్రమాదం జరిగిన రోజు ఫోరె న్సిక్ విభాగం అధిపతి డాక్టర్ అజడ్ తవాడే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారని ఇదివరకు వార్తలు వచ్చాయి. ఆ సందర్భం గా నిందితుడి రక్త నమూనాలను మార్చేసేందుకు భారీ మొత్తం ఇచ్చేలా డీల్ కుదిరిందనే ఆరోపణలు ఉన్నా యి. ఈ క్రమంలోనే బాలుడి తల్లి శాంపిళ్లను బ్లడ్ టెస్ట్‌కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్‌ను మార్చినందుకు ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.






