పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి
ముందస్తు బెయిల్ తిరస్కరించిన కోర్టు
బెంగళూరు, జూన్ 1 : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన తల్లి భవానీ రేవణ్ణ పరారీలో ఉన్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఇంటి పనిమనిషి కిడ్నాప్ ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆమెను విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు పంపారు. శనివారం ఇంటికి వచ్చి ప్రశ్నిస్తామని నోటీసులలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు హోళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా ఆమె కనిపించలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చిందని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఆమె పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా బెంగళూరు కోర్టు దాన్ని తిరస్కరించింది. కాగా, మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగిన వెంటనే అరెస్ట్ అయిన సంగ తి తెలిసిందే. విచారణ నిమిత్తం కోర్టు ఆయనను 6 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగించింది. అయితే, ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసిన వారందరూ మహిళా పోలీసులే కావడం గమనార్హం.






