20 April, 2026 | 1:41 AM

శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

20-04-2026 12:00 AM

వరంగల్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారమగుచూ పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో ఈనెల 19 నుంచి 30 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడే శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరిగినది.

ఉదయం 4-00లకు అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట ఆలయ అర్చకులు అమ్మవారికి ఉత్సవాంగీకార ప్రార్ధన జరిపారు. అనుజ్ఞ లభించిన వెంటనే అమ్మవారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ, పుణ్యహవాచనం, నాంది, ఇడాహవాచనం, బ్రహ్మకూర్చహెూమం, పంచగవ్య ప్రాశన, ఋత్విగ్వరణం, మధుపర్కవిధి జరిపి వాస్తుయాగం, పర్యగ్నికరణం, మృత్సంగ్రహణం, ధ్వజాధివాస కార్యక్రమాలు నిర్వహించి ఉదయం గణవతి సేవను, సాయంకాలం శ్రీ సుబ్రహ్మణ్య సేవ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపారు.

కళ్యాణ బ్రహ్మోత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఎండపొడ లేకుండా నీడనిచ్చే విధంగా శాశ్వత ప్రాతిపదికపై భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 10 లక్షల రూపాయల విరాళంతో నిర్మాణం జరిపిన జర్మన్ పెండాల్స్ ఆవిష్కరించారు. అనంతరం దేవాలయ ధర్మకర్తల మండలి కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

అంకురార్పణ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. తెలంగాణా తొలి సభాసతి శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సిరికొండ మధుసూదననాచారి, తెలుగు విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ త్రిమూర్తుల గౌరిశంకర్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ వేములవాడ మదన్మోహన్ పాల్గొన్నారు. పది రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి అమ్మవారి కావాలని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఈవో, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత కోరారు.