బ్రేక్‌ఫాస్ట్‌కు బ్రేక్?
- గత ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభం
- మెజార్టీ స్కూళ్లలో అమలుకాని పథకం
- కొత్త స్కీం యోచనలో రేవంత్ సర్కారు
- అదనంగా స్నాక్స్ అందించే ఆలోచన
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హడావుడిగా ప్రారంభించిన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంకు దాదాపు బ్రేక్ పడినట్లుగా కనబడుతోంది. చాలా స్కూళ్లలో ఇది అమలు కావ డంలేదు. నిధులు కూడా సరిగా కేటాయించకపోవడంతో బ్రేక్‌ఫాస్ట్ స్కీం పకడ్బందీగా సాగడంలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులు చాలా మంది స్కూళ్లకు అర్థాకలితో వస్తుంటారు.
ఉదయం టిఫిన్, భోజనం చేసి వచ్చేవారు తక్కువే. ఇలాంటి వారికోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఆలోచన చేసి ఉదయం పూట పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు టిఫిన్ పెట్టాలని భావించి సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను 2023 అక్టోబర్ 6న రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఈ స్కీం చాలా స్కూళ్లలో అమలు కావడంలేదని ఉపాద్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. దీని స్థానంలో మరోక స్కీంను తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ సర్కారు చేస్తున్నట్లు సమాచారం.
సాయంత్రం స్నాక్స్ కలిపి
ముందు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను కొన్ని సర్కారు బడుల్లో ప్రారంభించి ఆతర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రచించారు. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందు విద్యార్థులకు నాణ్యమైన, పౌష్ఠికాహారాన్ని అందించేలా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని దాదాపు 27వేల పాఠశాలలుంటే అందులో కేవలం 3,500 వరకు పాఠశాలల్లోనే దీన్ని అమలు చేశారు. అది కూడా ఒకేసారి కాకుండా దశలవారీగా విస్తరించారు. మిగతా స్కూళ్ల ల్లోనూ ఇది అమల్లోకి వస్తుందనుకుంటే ప్రారంభించే స్కూళ్లలోనే ఇది బ్రేక్ పడే పరిస్థితికి వచ్చింది. సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు సంబంధించి నిధుల కేటాయింపు, ఖర్చులకు సంబంధించి మార్గదర్శకాలను సరిగా రూపొందించలేదని చేయలేదనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం అటకెక్కే పరిస్థితిలో ఉంది.
అయితే దీని స్థానంలో మరో స్కీంను తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రవీంద్ర భారతిలో కొన్ని రోజులు క్రితం జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాయంత్రం వేళలో స్నాక్స్ కూడా అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే స్కూల్‌కు వచ్చే విద్యార్థికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంతోపాటు సాయంత్రం స్నాక్స్ కూడా అందించేలా ఓ కార్యక్రమాన్ని విద్యాశాఖ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రస్తుతం ప్రాథమిక స్థాయలోనే ఉందని ఓ అధికారి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అల్పాహారం, స్నాక్స్ అందించాలనే దానిపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 27,147 పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఇప్పటికే అన్ని స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం పథకం నడుస్తోంది. కానీ బ్రేక్ ఫాస్ట్ సరిగా అందడంలేదు. పదో తరగతి వార్షిక పరీక్షల సమయంలో కేవలం పదోతరగతి విద్యార్థులకు మాత్రమే స్పెషల్ క్లాసుల సందర్భంగా కొన్ని రోజుల వరకు సాయంత్రం పూట స్నాక్స్‌ను అందించారు. ఇప్పుడు అది కూడా అమలు కావడంలేదు.






