22 July, 2026 | 9:00 AM

బడ్జెట్ రూ.2.80లక్షల కోట్లు!

30-06-2024 12:40 AM
  1. జూలై 31లోపు సమావేశాల నిర్వహణ
  2. అంచనాలను సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ
  3. వాస్తవికతకు దగ్గరగా ఉండాలని సీఎం దిశానిర్దేశం
  4. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపుల్లో సవరింపులు
  5. గ్యారెంటీలు, వ్యవసాయానికి అధిక ప్రధాన్యం
  6. కేంద్ర బడ్జెట్ తర్వాతే ప్రవేశపెట్టే అవకాశం

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. దాదాపు రూ.2.80లక్షల కోట్లతో పూర్తిస్థాయి పద్దును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2.75 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఓటాన్ అకౌంట్ పద్దుకు కొంత మొత్తాన్ని జోడించి మొత్తం రూ.2.80 లక్షల కోట్ల అంచనాలతో జూలై 31లోపు పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అన్ని డిపార్ట్‌మెంట్ల నుంచి ఆర్థిక శాఖ అంచనాలను తెప్పించుకున్నది. ఈ నేపథ్యంలో శాఖలవారీగా కేటాయింపులపై కసరత్తు జరుగుతోంది. జూలై చివరి వారం కల్లా బడ్జెట్ పత్రాలను సిద్ధం చేసి ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రికి సమర్పించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.

కేంద్ర బడ్జెట్ తర్వాతే.. 

కేవలం నాలుగు నెలల గడువుతోనే రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీంతో జులై 31వ తేదీతో ఓటాన్ అకౌంట్ పద్దు గడువు ముగిస్తుంది. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలోని తదుపరి 8 నెలలకు కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూలైలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. అంటే జులై 31లో బడ్జెట్ ఆమోదం పొందాలి. ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర పద్దును ప్రకటించాలని రేవంత్‌రెడ్డి సర్కారు చూస్తోంది. రాష్ట్రంలోని కొన్ని కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

అందులో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, మూసీ పునరుద్ధరణ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం కేటాయింపులను చూసి ఓటాన్ అకౌంట్ పద్దును సవరించి బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పించాలని సర్కారు చూస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జులై 22 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో జూలై 29లోపు కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెడితే 31 నాటికి రాష్ట్ర సర్కార్ కూడా తన పద్దను అసెంబ్లీలో సమర్పిస్తుంది. కేంద్రం ప్రకటించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఆగస్టుతో ముగుస్తుంది. ఒకవేళ కేంద్రం ఆగస్టు మొదటి వారంలో బడ్జెట్ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పూర్తిస్థాయి పద్దును ఒకటి లేదా రెండు రోజుల తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టే అనివార్యత ఏర్పడనుంది. 

ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యం

త్వరలో ప్రవేశపెట్టనున్న ఫుల్ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఇప్పటికే ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పూర్తిస్థాయి పద్దులో ప్రధానంగా ఆరు గ్యారెంటీలకు పెద్ద పీట వేయనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు రూ.53,196కోట్లను కేటాయించారు. కానీ అవి సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. అంచనా వేసిన సంఖ్య కంటే లబ్ధిదారులు భారీగా పెరిగారు. కొత్త బడ్జెట్‌లో ఈ గ్యారంటీలకు నిధులను దాదాపు 40 శాతం వరకు పెంచే పరిస్థితి కనిపిస్తోంది. అంటే అదనంగా మరో రూ.20వేల కోట్ల నుంచి రూ.25వేల కోట్లను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు కలిపి నిధులను వెల్లడించిన సర్కారు.. ఇప్పుడు మాత్రం విడివిడిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విడివిడిగా ప్రకటించడం వల్ల గందరోగళ పరిస్థితులు ఏర్పడవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయానికి కూడా ఈ పద్దులో కేటాయింపులను పెంచే అవకాశం కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డి సర్కారు ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్రంలో మార్చి 17 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ అమల్లో ఉన్నన్ని రోజులు ఎలాంటి అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం లేదు. దీంతో బడ్జెట్‌లో నిధులు అలాగే ఉండిపోయాయి. ఆ నిధులను త్వరలో ప్రవేశపెట్టబోయే పూర్తి బడ్జెట్‌లో ప్రభుత్వం కలిపి దాదాపు రూ.2.80లక్షల కోట్ల అంచనాతో పద్దును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవికతకు దగ్గరగా..

బడ్జెట్ రూపకల్పనను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు సచివాలయవర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను తొలుత అధికారులు రూ.3.10లక్షల కోట్లకు అంచనాలతో సిద్ధం చేశారట. ఆ అంచనాలను చూసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇది వాస్తవాలకు దూరంగా ఉందని, దగ్గరగా ఉండేలా కేటాయింపులను సవరించాలని అధికారులకు సూచించారట. దీంతో ఆ పద్దును సవరించిన అధికారులు రూ.2.75కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. ఇప్పుడు రూపొందిస్తున్న బడ్జెట్ కూడా వాస్తవికతకు దగ్గరగా ఉండాలని అధికారులకు సీఎం సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బడ్జెట్ రూపకల్పనపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని డిప్యూటీ సీఎంకు అధికారులు వివరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో 

కీలక శాఖ కేటాయింపులు

(రూ.కోట్లలో)

మొత్తం బడ్జెట్ 2,75,891

ఆరు గ్యారెంటీలు 53,196

పంచాయతీరాజ్ శాఖ 40,080

నీటిపారుదల శాఖ 28,024

విద్యారంగం 21,389

వ్యవసాయశాఖ 19,746

పురపాలక శాఖ 11,692

వైద్య రంగం 11, 500

గృహ నిర్మాణం 7,740

మూసీ ప్రాజెక్టు 1000

ఎస్సీ సంక్షేమం 21,874

ఎస్టీ సంక్షేమం 13,013

బీసీ సంక్షేమం 8వేలకోట్లు

మైనార్టీ సంక్షేమం 2,262