16-12-2025 02:23:31 AM
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 70 ఏళ్లుగా ఆ పంచాయతీకి ఎన్నికలు లేవు. గ్రామస్తుల ఐక్యతతో ఏడు దశాబ్దాలుగా ఏకగ్రీవంగానే సర్పంచులు ఎన్నికవుతున్నారు. అలాంటి పంచాయతీ ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పంచాయతీ పరిధిలోని ప్రజలందరూ పల్లెపోరుపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.
ఆదిలాబాద్, తలమడుగు, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ పంచాయతీ అది. ఈ పంచాయతీకి 69 ఏళ్లుగా సర్పంచ్‌ను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటూ వస్తున్నారు. కానీ ఆ పంచాయతీ ఏకగ్రీవానికి ఈసారి ఎన్నికల నిర్వహణతో బ్రేక్ పడింది. సర్పంచ్ పదవికి ఈసారి పోటీ నెలకొంది. ఏకగ్రీవ ఆనవాయితీ కొనసాగించాలని గ్రామ పెద్దలు పేర్కొంటుండగా... బరిలో నిలవాల్సిందేనని కొందరు వ్యక్తులు పంతం పట్టారు. చివరకు సర్పంచ్ పదవికి పోటీ తప్పలేదు. ఈనెల 17న జరిగే మూడో విడత పోలింగ్‌లో ఈ బరంపూర్ పంచాయతీ ఉంది.
ఈ పంచాయతీ పరిధిలో మూడు వేలకు పైగా జనాభా ఉంటుంది. మొత్తం 2,258 మంది ఓటర్లు ఉన్నారు. 1956లో ఏర్పడిన బరంపూర్ పంచాయతీలో అప్పటి నుంచి కిందటి పాలకవర్గం వరకు ఎన్నికలు, పోటీ లేకుండా సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకంటూనే వస్తున్నారు. ఇన్నేళ్లుగా ఊరి ప్రజలంతా ఏకతాటిపై నడుస్తూ.. బడి, గుడి, రోడ్డు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేసుకున్నారు. గ్రామస్తుల అందరి సహకారంతో గ్రామ సమీపంలోని గుట్టపై ప్రాచీనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సైతం అభివృద్ధి చేశారు.
ఏకగ్రీవ గ్రామంలో ఎన్నికల చిచ్చు
మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ఊరిలో ఏకగ్రీవంగా కొనసాగుతున్న సర్పంచుల ప్రక్రియకు బ్రేక్ పడి, ఒక్కసారిగా రాజకీయ పోటీలు మొదలయ్యాయి. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఈ పంచాయతీ ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయింది. ఎప్పటిలాగే ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనే కాంగ్రెస్ మద్దతుతో సిడాం లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేయగా.. వారికి ప్రత్యర్థిగా బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన మెస్రం దేవ్‌రావు బరిలో నిలిచారు. దీంతో గ్రామంలో రాజకీయాలు మొదలై, ఇరువర్గాల మధ్య పోటీ అనివార్యమైంది.
30 ఏళ్లు ఒకే వ్యక్తి సర్పంచ్‌గా...
బరంపూర్ గ్రామంలో భూస్వామిగా ఉన్న ముడుపు కుటుంబ సభ్యులే గ్రామ పెద్దగా కొనసాగుతూ వస్తున్నారు. రిజర్వేషన్ లేని సమయంలో ఆ కుటుంబానికి చెందిన ముడుపు భూమారెడ్డి 30 ఏళ్లుగా సర్పంచ్‌గా కొనసాగారు. అనంతరం ఆ కుటుంబం మద్దతుతోనే గ్రామానికి చెందిన పలువురు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి మద్దతు దారులుగా ఉన్న వారు నామినేషన్ చేశారు.