25 February, 2026 | 12:35 AM

టీ పొడి కల్తీ ముఠా అరెస్ట్

24-02-2026 09:22 PM

 – భారీ పరిమాణంలో స్వాధీనం

సనత్‌నగర్,(విజయక్రాంతి): కమిషనర్ టాస్క్ ఫోర్స్ (వెస్ట్ జోన్) బృందం సనత్‌నగర్ పోలీసులతో కలిసి సనత్‌నగర్ ప్రాంతంలో దాడి నిర్వహించి టీ పొడిని కల్తీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసింది. నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్ (33), ఫతేనగర్‌కు చెందినవాడు.

పోలీసుల విచారణలో నిందితుడు కోకోపీట్ (కొబ్బరి పీచు పొడి)ను శుద్ధి చేసి, వేడి బెల్లం నీటితో కలిపి ఎండబెట్టి, ‘సన్‌సెట్ ఎల్లో’, ‘టార్ట్రాజైన్’ వంటి సింథటిక్ రంగులు జోడించి నాసిరకం టీ డస్ట్, టీ గ్రాన్యూల్స్‌తో మిక్స్ చేసి కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నట్లు బయటపడింది. ఒక కిలో కల్తీ టీ తయారీలో 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కల్తీ టీని అసలైన టీగా చూపించి స్థానిక టీ స్టాళ్లకు, డీలర్లకు విక్రయిస్తున్నాడు.

దాడిలో 120 కిలోల కల్తీ టీ పొడి, 30 కిలోల సహజ టీ పొడి, 138 కిలోల కోకోపీట్ మిశ్రమం, 1 వెయింగ్ మెషిన్, 800 గ్రాముల సన్‌సెట్ ఎల్లో, 700 గ్రాముల టార్ట్రాజైన్ రంగులు, గ్యాస్ సిలిండర్, బెల్లం బాక్సులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు నాణ్యమైన, గుర్తింపు పొందిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని, అనుమానం ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.