చిన్ననాటి స్నేహానికి మళ్లీ ఊపిరి
ఇల్లందు టౌన్, ఆగస్టు 9 (విజయక్రాంతి): 24 ఏరియా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1993-94 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. అప్పట్లో కలిసి చదువుకున్న రోజులు, పాఠశాలలో జరిగిన సరదా సంఘటనలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. కాలం మారినా చిన్ననాటి స్నేహం, పాఠశాల జ్ఞాపకాలు చెరిగిపోవని పలువురు పేర్కొన్నారు.
ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడం ద్వారా పాత స్నేహితుల మధ్య అనుబంధం మరింత బలపడిందన్నారు. ప్రస్తుతం ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ రంగంలో స్థిరపడ్డారు అనే విషయాలను పరస్పరం తెలుసుకుంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ఫొటోలు దిగుతూ ఆనాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. భవిష్యత్లోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ స్నేహబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.






