5 August, 2026 | 2:20 AM

అక్రమ వండ్రుమట్ట్టీతో ఇటుక బట్టి వ్యాపారం!

05-08-2026 01:27 AM

దెబ్బతింటున్న గ్రామీణ రహదారులు 

కల్వకుర్తి ఆగస్టు 4 (విజయక్రాంతి): చెరువుల నుంచి వండుమట్టిని అక్రమంగా తరలిస్తూ ఇటుక బట్టీల నిర్వాహకులు భారీగా వ్యాపారం సాగిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాభావంతో చెరువులు పూర్తిగా ఎండిపోవడాన్ని ఆసరాగా చేసుకుని, రాత్రి వేళల్లో భారీ యంత్రాల సాయంతో వండుమట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పదుల సంఖ్యలో టిప్పర్లు నిరంతరం రాకపోకలు సాగిస్తూ మట్టిని నిల్వ చేసుకుంటున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా చెరువుల నుంచి విలువైన వండుమట్టిని తరలించడం చట్ట విరుద్ధమైనప్పటికీ, సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్వకుర్తి మండలం ముకురాల కింది చెరువు నుంచి ఎల్లికల్ సమీపంలోని ఇటుక బట్టీలకు గత రెండు రోజులుగా వండుమట్టిని తరలిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. టిప్పర్ల రాకపోకలతో మట్టి రహదారులు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లడానికే ఇబ్బందులు పడుతున్నారు.

కాల్వల మట్టి కనుమరుగు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా 29వ ప్యాకేజీ ప్రధాన కాలువ కల్వకుర్తి నుండి ఎల్లికల్ శివారు వరకు ఉన్న ప్రధాన కాలువ మట్టి పూర్తిగా తరలించారు. సుమారు నెలరోజులుగా ఎల్లికల్ గుట్టల సమీపం నుండి తిమ్మ రాశి పల్లి సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేసిన భూమిలోకి భారీగా మట్టిని తరలించారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. పల్లెల్లో టిప్పర్లు బుల్డోజర్ తిష్ట వేసి ప్రకృతి వనరులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. సెలవు రోజులు, పగటి వేళల్లో కల్వకుర్తి ఎత్తిపోతల కాలువల నుంచి మట్టిని తవ్వి రవాణా చేస్తున్నారు.

టిప్పర్లు అతివేగంగా నడపడంతో ఎదురుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పోలీసులు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాను అడ్డుకోవాలని, చెరువుల పరిరక్షణతో పాటు భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.