30-01-2026 12:00:00 AM
బీబీపేట, జనవరి 29, (విజయక్రాంతి): పెళ్లయిన రెండు నెలలకే నవ వధువుకు నూరేళ్లు నిండాయి. ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బీబీపేట మండలం జనగామ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన అనూషకు జనగామ గ్రామానికి చెందిన నవీన్‌తో రెండు నెలల క్రితం వివాహమైంది. రెండు నెలల పాటు భార్యాభర్తలు బాగానే ఉన్నారు.
పొలం పనుల నిమిత్తం బుధవారం భర్త నవీన్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అనూష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయి రెండు నెలలు కూడా కాకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంలో కలకలం రేపింది. అయితే అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడిందా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.