వంతెనతో రాకపోకలు సులభతరం
కుమ్రం భీం ఆసిఫాబాద్ ఆగస్టు18( విజయ క్రాంతి):గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆబ్కారీ, మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కాగజ్నగర్ మండలం అంకుశ పూర్‌తట్టుగూడెం మధ్య రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవె ల్ వంతెనకు ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినప్పుడు రాకపోకలకు అంతరాయం లేకుండా హై లెవెల్ వంతెనలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. వంతెన పూర్తయితే కాగజ్నగర్‌వాంకిడి ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడుతుందని, గ్రామీణ ప్రజలకు మార్కెట్లు, విద్యా, వైద్య సేవలకు చేరుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు.వంతెన పనుల ను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత అంచనాలు, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణం గా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అర్హులకే సంక్షేమ పథకాలు
అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా ఎంపికలు చేపడుతున్నామని రాష్ట్ర ఆబ్కారీ, మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిర్పూర్, కాగజ్నగర్ నియోజకవర్గాలకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను సమానంగా కేటాయించామని తెలిపారు. నిరుపేదలు, ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకత పాటిస్తున్నామని, అనర్హులకు ఇళ్లు మంజూరైనట్లు తేలితే వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పర్యాటక అభివృద్ధికి నియోజక వర్గానికి రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. లోటు వర్షపాతం నేపథ్యంలో రైతుల ప్రయోజనార్థం వట్టివాగు ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మట్, ఎం.డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






