17-02-2026 04:50:49 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలంలో ఇప్పటికే పనిచేస్తున్న ఎంఎస్‌ఎన్ ఫార్మ పరిశ్రమతో పాటు నిర్మాణ దశలో ఉన్న ఫ్యూజన్ ఫార్మ పరిశ్రమ, భవిష్యత్తులో ఏర్పాటుకు సిద్ధమవుతున్న ఇతర పరిశ్రమలకు వ్యతిరేకంగా పలు గ్రామాల ప్రజాప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఎనిమిది గ్రామాల సర్పంచులు, యువకులు, గ్రామస్తులు కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
కెమికల్ పరిశ్రమల వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటోందని, ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాలుష్య కారణంగా శ్వాసకోశ వ్యాధులు, చర్మ సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు
“పల్లె గాలి పవిత్రం… ఫార్మా కాలుష్యం అపవిత్రం!”,
“మా భూమి ముద్దు… కెమికల్ ఫార్మా వద్దు!”,
“ఆరోగ్యమైన పల్లె కావాలి… రోగాలు తెచ్చే ఫ్యాక్టరీలు వద్దు!”,
“పంట పొలాలు పచ్చగా ఉండాలి… పొగలు కక్కే ఫార్మాలు కాదు!”,
“మా ఊరి నీళ్లు మా జీవం – వాటిని కలుషితం చేసే పరిశ్రమలు వద్దు!”,
“ప్రకృతి పరిరక్షణే నిజమైన అభివృద్ధి”,
“పల్లె భవిష్యత్తు కోసం… కాలుష్య పరిశ్రమలకు బంద్!”,
“మా పిల్లల ఆరోగ్యం మాకు ముఖ్యము – ఫార్మా కాలుష్యం అస్సలు అవసరం లేదు!”,
“పల్లెను కాపాడుకుందాం… ప్రకృతిని ప్రేమిద్దాం” అంటూ నినాదాలు చేశారు.
ఈ పరిస్థితుల్లో తక్షణమే సంబంధిత గ్రామపంచాయతీల్లో ప్రత్యేక తీర్మానాలు చేసి, ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయించారు. ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాలుష్య పరిశ్రమలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.