5 May, 2026 | 2:52 AM

రైతు సమస్యలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్, సీపీఎం

05-05-2026 01:24 AM

ధాన్యం కొనుగోలు జాప్యంపై తీవ్ర ఆందోళన

అశ్వాపురం, మే 4 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో ధాన్యం కొనుగోలు జాప్యంపై సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. ఈ ఆందోళనకు అధిక సంఖ్యలో రైతులతో పాటు సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మణుగూరుకొత్తగూడెం ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం బస్తాలతో రాస్తారోకో నిర్వహించి గంటకు పైగా రహదారిని దిగ్బంధించారు. ఎండ తీవ్రత మధ్య కొనసాగిన ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం నాయకుడు బద్దం శంబిరెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. 

మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, జాలే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విషయం తెలుసుకున్న అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించినా, వారు ఆందోళన కొనసాగించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ అక్కడికి చేరుకోగానే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చుట్టుముట్టారు. అయితే, రేపటి నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపడతామని అధికారి హామీ ఇవ్వడంతో పరిస్థితి చల్లారింది.  బిఆర్‌ఎస్, సిపిఎం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.