28-01-2026 10:04:21 PM
- పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల అధికారికి పత్రాల అందజేత
- అభివృద్ధి నినాదంతో ప్రజాక్షేత్రంలోకి.. బిఆర్ఎస్ ధీమా
- గెలుపే లక్ష్యంగా కదులుతున్నాం: జిల్లా నాయకుడు కాంపెల్లి కనకేష్ పటేల్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తొలిరోజే 8వ డివిజన్ నుంచి బిఆర్ఎస్ పార్టీ తరపున కాంపెల్లి సంధ్య పటేల్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం తన భర్త, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కాంపెల్లి కనకేష్ పటేల్, పార్టీ ముఖ్య శ్రేణులతో కలిసి ఆమె భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
అభివృద్ధికి బాటలు వేస్తాం
ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ.. పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని 25 డివిజన్లలో పార్టీ గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 8వ డివిజన్ బాధ్యతను తాను పర్యవేక్షిస్తున్నానని, ఇక్కడ ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. అభ్యర్థిని సంధ్యా పటేల్ గెలుపు ద్వారా డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలే అజెండా..
అలాగే అభ్యర్థిని కాంపెల్లి సంధ్య పటేల్ మాట్లాడుతూ.. డివిజన్‌లోని ప్రతి గడపకూ చేరుకుని ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నామని, ఎన్నికల తర్వాత మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంధ్యకు మద్దతు తెలిపారు.
కాంగ్రెస్ వైఫల్యాలపై పోరు
గత వారం రోజులుగా డివిజన్ వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామని సంధ్యా పటేల్ పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిందని, ఆ అబద్ధపు హామీలను ప్రజల్లో ఎండగడుతున్నామని ఆమె పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఎంపీలు, ఎమ్మెల్సీల నిధులతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.