calender_icon.png 28 January, 2026 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేమాతరం రచనకు 150 ఏళ్లు

28-01-2026 10:10:47 PM

జడ్చర్ల: భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రాణప్రదమైన దేశభక్తి గీతం “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత మాత చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి  ముఖ్య వక్తగా పాలమూరు విశ్వ విద్యాలయ అధ్యాపకులు రాజశేఖర్ హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, వందేమాతరం గీతం భారతీయుల హృదయాలలో దేశభక్తి భావాలను రగిలించిన అమర గీతమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో ఈ గీతం ప్రజల్లో త్యాగం, ఐక్యత మరియు స్వదేశీ భావనను పెంపొందించిందని వివరించారు. కుదిరామ్ బోస్ , ఆస్పానుల్లా ఖాన్ వంటి యోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలి వేశారని , స్వాతంత్ర్య కోసం ఎన్నిసార్లయినా మరణిస్తామని చెప్పారు.

నేటి యువత ఈ గీతం ద్వారా జాతీయ విలువలను అవగాహన చేసుకోవాలని ఆయన సూచించారు.కళాశాల చరిత్ర అధ్యాపకులు రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఆనంద్ మఠ నవల నుంచి స్వీకరించిన వందేమాతరం దేశ ప్రజలను ఐక్య పరిచిందని చెప్పారు.వందేమాతరం గీతం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను వివరించారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతీయ ఉద్యమానికి ఈ గీతం ఎలా ప్రేరణగా నిలిచిందో ఆయన వివరించారు.

వందేమాతరం కేవలం ఒక గీతం మాత్రమే కాకుండా, భారతదేశ సాంస్కృతిక, జాతీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచిందని ఆయన అన్నారు.ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.యువత దేశ చరిత్రను తెలుసుకుని, జాతీయ విలువలను తమ జీవితంలో అనుసరించాలని ఆమె పిలుపునిచ్చారు.విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు.

వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశభక్తి, జాతీయ ఐక్యత, సాంస్కృతిక విలువలను మరింత బలోపేతం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సుకన్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నర్మదా, చరిత్ర అధ్యాపకులు రాఘవేంద్ర రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారులు సదాశివయ్య మాధురి, వేణు, ఎన్సిసి. అధికారి రాజేశ్వరి, నర్సింలు, నరసింహ రావు, వెంకటయ్య, నాగలక్ష్మి,లత,వెంకటేశ్వర్లు, రజినీ, వెంకట్ రెడ్డి, సతీశ్ రెడ్డి పుష్పలత, నంద కిషోర్, ప్రతాప్,శివుడు నరసింహ,విద్యార్థులు పాల్గొన్నారు.