calender_icon.png 29 January, 2026 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

28-01-2026 10:18:54 PM

జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి

బాన్సువాడ,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను బుధవారం జిల్లా ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల విధుల పట్ల అధికారులు పూర్తి జాగ్రత్త తో వ్యవహరించాలని ఆమె  సూచించారు.

ఈ సందర్భం గా మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను, నామినేషన్ ఫారాలు, రిజిస్టర్లను పరిశీలించారు. మొదటి రోజు ఆయా డివిజన్లు, వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తదితర అన్ని ప్రక్రియలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.

దాఖలైన నామినేషన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, రోజు వారీ గా వెంటనే టీ.పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. అభ్యర్థులు అన్ని వివరాల తో నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, వారి సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుబడి పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందు కు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయి లో ఎన్నికల సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ నెల 30 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు సంబంధిత మున్సిపాలిటీ పరిధిలోని ఏదైనా డివిజన్/వార్డులో ఓటరుగా నమోదై ఉండవచ్చని తెలిపారు. అయితే ప్రతి పాదకులు (ప్రపోజర్స్) మాత్రం అదే డివిజన్/వార్డుకు చెందిన ఓటరై ఉండాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచామని, నామినేషన్ పత్రాల పరిశీలన కోసం అవసరమైన సిబ్బందిని నియమించామని తెలిపారు.

ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పక్కాగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబడతాయని, ఎవరూ కూడా ఎలాంటి అపోహలు లేదా సందేహాలకు గురికా వద్ద ని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం లో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ ఓటర్లు 24,188 మంది ఓటర్లు.  బాన్సువాడ మున్సిపల్ పరిధిలో 19 వార్డుల్లో 24,188 మంది ఓటర్లు ఉండగా అందులో 11 578 పురుషులు కాగా, 12, 599 మంది స్త్రీలు ఉన్నారు, ఇతరులు 11 మంది ఉన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో పురుషుల కన్నా మైలా ఓటర్ల అధికంగా ఉండడం  గమనార్హం.