బీఆర్‌ఎస్ బతికి బట్ట కట్టదు

28-04-2024 01:05:13 AM

l ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

జనగామ, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): తెలంగాణలో బీఆర్‌ఎస్ బతికి బట్ట కట్టబోదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. జనగామ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో శనివారం ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాపాల చిట్టాను వెలికితీసి, అవినీతి సొమ్మును కక్కిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్  రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందన్నారు. ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నేతలు అధికారం కోల్పోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే పనిచేసిందన్నారు. అలాగే బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నదన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే జనగామ ప్రాంతాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పార్టీ నేతలు రాజలింగంగౌడ్, ప్రొఫెసర్ నాగభూషణం, బాల లక్ష్మి, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి పాల్గొన్నారు.