కోమటిరెడ్డికి కోడికి ఉండే బ్రెయిన్ కూడా లేదు

28-04-2024 01:03:33 AM

l ఆగస్టు 15లోపు హామీలు నెరవేరిస్తే హరీశ్‌రావు రాజీనామా

l నెరవేర్చకపోతే సీఎం రేవంత్ రెడ్డితో రాజీనామా చేయిస్తారా?

l మంత్రి కోమటిరెడ్డికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్

కరీంనగర్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోడికి ఉన్న బ్రెయిన్ కూడా లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డికి మంత్రి అయ్యాక ఆయన మానసిక సరిగా లేక మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రాజీనామా చేయించేందుకు  సిద్ధమా? అని మంత్రి కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి హవాలా దందాలకు చిరునామా అన్నారు. ఆగస్టు 15 లోపు రాష్ట్రప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో మాజీ మంత్రి హరీశ్‌రావు అమరవీరుల స్థూపం వద్ద రాజీనామా లేఖ ఉంచారని, దానిలో తప్పేముందని ప్రశ్నించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా ఆరు గ్యారంటీలను అమలు చేసే సత్తా ఉంటే ఆయన తమ సవాళ్లను స్వీకరించాలని సవాల్ విసిరారు. రుణమాఫీ, రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెడతారన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ముమ్మాటికీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేతలు ప్రజల పక్షాన పోరాడడం ఎలాగో మాజీ మంత్రి హరీశ్‌రావును నేర్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో టెస్కాబ్  చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకర రవిశంకర్, ముఖ్యనేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బండ శ్రీనివాస్, రమేష్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.