29 April, 2026 | 2:13 AM

రైతులు బాగుంటే బీఆర్‌ఎస్ ఓర్చుకోవడం లేదు

29-04-2026 12:26 AM

వారికి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అన్యాయమెంటో చెప్పాలి 

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతులు సంతోషంగా, చల్లగా ఉంటే బీఆర్‌ఎస్ ఓర్చుకోవడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు అని, తమ ప్రభుత్వ హయాంలో రైతును రాజును చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌లో రైతు సభను ఎందుకు పెట్టాలనుకుంటుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతులకు సీఎం రేవంత్ రెడ్డి  చేసిన అన్యాయం ఏమిటో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేసీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, కాంగ్రెస్ హయాంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రవేశపెట్టిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.  రాష్ట్రంలో మొత్తం 8,525 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 6,005 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

7.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసి రైతులకు రూ. 277 కోట్ల రూపాయలను చెల్లించామని, ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని, ఇవి కేసీఆర్ కు కనిపించడం లేదా..? కొనుగోలు సెంటర్లు లేవని, వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. ‘పదేళ్ల పాపాపు పాలనలో భాగస్వామ్యం అయినందుకు క్షమాపణలు చెపుతానని కవితే చెప్పింది.

దెయ్యాలు, పందికొక్కులను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని కవిత అంటోంది. కర్కోటకుడు, హిట్లర్ పాలన కేసీఆర్‌దే.సారు రారు.. కారు రాదని వాళ్ల కుటుంబ సభ్యులే చెపుతున్నారు. కవిత ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నాడు’ అని ఆయన విమర్శించారు. .రాష్ట్రంలో కొత్త పార్టీకి స్పెస్ లేదని, ఇంట్లో గొడవల వల్లనే కవిత పార్టీ పెట్టిందన్నారు. మళ్లీ రేవంత్ రెడ్డి సర్కార్ రావాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.