ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

28-04-2024 01:31:11 AM

అమరవీరుల త్యాగ ఫలితమే నేటి ప్రత్యేక తెలంగాణ

మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

వేడుకల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు

కామారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఉద్యమాల పోరాటం.. అమరవీరుల త్యాగ ఫలితమే నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాన్సువాడలోని నియోజకవర్గ కార్యాలయంలో శనివారం గులాబీ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... 2001 ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామన్నారు. 2 జూన్ 2014 న అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

కేసీఆర్ పాలనలో, అతి తక్కువ సమయంలో దేశంలో మరే రాష్ట్రం చేయనంత అభివృద్దిని, పనులను చేసి చూపించిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని ప్రశంసించారు. బీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రంలో, బీజే పీ కేంద్రంలో ఒకేసారి 2014లో అధికారంలోకి వచ్చాయన్నారు. గత పదేళ్లలో రైతుల కోసం, యువకుల కోసం, వృద్ధుల కోసం బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం రెట్టిం పు చేస్తామని మోడీ చెప్పి, ఎక్కడ మద్దతు ధరకు చట్టబద్దత కూడా కల్పించలేదని విమర్శించారు. అదాని, అంబానీలకు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని, రైతులకు మాత్రం చేయలేదని వాపో యారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజి రెడ్డి, మున్సిపల్ చైర్మ న్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మున్సిపల్ కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్ కృష్ణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.