తునికాకు సేకరణకు వేళాయె

28-04-2024 01:26:43 AM

7 సర్కిళ్లు, 194 యూనిట్ల ద్వారా మే 1 నుంచి సేకరణ 

2,12,700 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యం

ధర పెరిగినా ఆకు సేకరణపై తగ్గిన ఆసక్తి

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): తునికాకు సీజన్ ప్రారంభ మైంది. ప్రతి వేసవిలో లక్షలాది మంది ఆదివాసీలకు తునికాకు ఆదాయ వనరుగా ఉంటుంది. రాష్ట్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది తునికాకు సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో మే 1 నుంచి 7 సర్కిళ్లలో 194 యూనిట్లు, 2,173 కల్లాల ద్వారా 2,12,700 స్టాండర్డ్ బ్యాగులు సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. 50 ఆకుల కట్టకు ప్రభుత్వం రూ.3 చెల్లిస్తుండగా, కాంట్రాక్టర్ అదనంగా 3 పైసలు కలిపి మొత్తం రూ 3.03 గా ధర నిర్ణయించడం జరిగింది. ఆదివాసీలు, రైతు లు ప్రతి ఏటా వ్యవసాయ సీజన్ పూర్తయిన తర్వాత మే 1వ తేదీ నుంచి 31 వరకు అడవిలో తునికాకులను సేకరిస్తుంటారు.

వయ సుతో నిమిత్తం లేకుండా తెల్లవారుజామునే అడవంతా కలియతిరుగుతూ ఆకు సేకరణ చేపడతారు. దీంతో గిరిజన పల్లెలో ఈ సమయంలో పండుగ వాతావరణం నెలకొం టుంది. నెలరోజుల పాటు వారికి చేతినిండా పని లభిస్తుంది. ఎండలు అధికంగా ఉండటంతో వేకువజామునే అడవి బాట పడతా రు. ఉదయం 9 గంటలలోపు ఆకు సేకరణ చేసి ఇంటికి చేరుకొని 50 ఆకులు కలిపి కట్ట గా కడతారు. వాటిని కల్లాల వద్ద కాంట్రాక్టర్లకు విక్రయిస్తుంటారు. ఇలా గిరిజనుల నుంచి సేకరించిన తునికాకును వారం పది రోజుల పాటు ఎండబెట్టి బస్తాల్లో నింపి బీడీ ల తయారీకి కాంట్రాక్టర్ విక్రయిస్తుంటారు. నెలరోజుల్లో వేల కోట్ల రూపాయల వ్యాపా రం జరుగుతుంది. ఫలితంగా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. 

7 సర్కిళ్లుగా..

రాష్ట్రంలో 7 సర్కిళ్ల ద్వారా 2,12,700 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్య ంగా పెట్టుకున్నారు. కాలేశ్వరం సర్కిల్‌లో 66 యూనిట్ల ద్వారా 66,800 బ్యాగులు, మంచిర్యాల సర్కిల్‌లో 48 యూనిట్ల ద్వారా 71,100, బాసర సర్కిల్‌లో 8 యూనిట్ల ద్వా రా 5,800, రాజన్న సిరిసిల్ల సర్కిల్‌లో 10 యూనిట్ల ద్వారా 5 వేల బ్యాగులు, భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్‌లో 54 యూని ట్ల ద్వారా 60,400, చార్మినార్ సర్కిల్‌లో 6 యూనిట్ల ద్వారా 1,900, జోగులాంబ సర్కిల్‌లో 2 యూనిట్ల ద్వారా 1,700 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు.

లక్ష్యం చేరని సేకరణ..

ప్రభుత్వం ఆదివాసీలు, రైతుల శ్రమకు తగ్గట్టుగా ధర పెంచినా.. అడవులు తరిగిపోయి ఆకు లభించక పోవడం, వాణిజ్య పంటల ద్వారా ఆశించిన ఆదాయం రావడంతో తునికాకు సేకరణపై ప్రస్తుతం ఆసక్తి తగ్గింది. ఫలితంగా ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం చేరుకోవడంపై అనుమా నాలు తలెత్తుతున్నాయి. ఏటికేడు సేకరణ లక్ష్యం తగ్గుముఖం పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ఆరు డివిజన్లలో గత నాలుగేళ్లుగా సేకరించిన తునికాకు లెక్కలను చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. 2020లో 6 డివిజన్లలో 35,700 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యంగా నిర్ధారిస్తే 30,312.58, 2021 సీజన్‌లో 38,500 బ్యాగులకు 32,234.20, 2022లో 35,100 బ్యాగులకు 24,5 40.70, 2023లో 35,100 బ్యాగులకు 20,608.40 బ్యాగుల సేకరణ మాత్రమే జరిగింది. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.