26 April, 2026 | 2:23 AM

కేసీఆర్‌ను మర మనిషి అనొద్దు

26-04-2026 12:43 AM

కవితకు హితవు పలికిన బీఆర్‌ఎస్ నేత జీవన్‌రెడ్డి

జగిత్యాల, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కేసీఆర్‌ను ‘మర మనిషి’ అని అనొద్దని, ఆ మాట ను కవిత ఉప సంహరించుకోవాలని, రాష్ట్రానికి పట్టిన పీడ, శనిని తొలగించేందుకు ఉద్యమించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల పట్టణం ఆయ న స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎవరైనా ఏర్పాటు చేయవచ్చు మాజీ ఎమ్మెల్యే కవిత పార్టీ ఏర్పాటు సందర్భంగా కేసీఆర్‌తో ఉన్న అనుబంధం, ఆత్మీయతను మరిచి, కుటుంబ సభ్యురాలిగానే కాకుండా, ఉద్యమనేత అయిన కేసీఆర్‌ను మరమనిషి అనటం సరికాదన్నారు. 2001లో కేసీఆర్ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించి సమాజాన్ని జాగృ తం చేసి, అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. కేసీఆర్‌తో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది.

కవిత కూడా తెలంగాణ ఉద్యమ బలోపేతానికి జాగృతి ద్వారా, ప్రజలను జాగృతం చేశారు. బీఆర్‌ఎస్‌తో విభేదాలు రావొచ్చు, కానీ వాస్తవాలను విస్మరించరాదన్నారు. కేసీఆర్ వంటి గొప్పమనసున్న మనిషిని ‘మర మనిషి’గా పేర్కొనడం సరికాదని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి, ఆర్టీఎస్‌తోపాటు, మిషన్ కాకతీయ, మిష న్ భగీరథ వంటి పథకాలను ఎవ్వరూ ఊహించలేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్, సింగూరు, ఎస్‌ఆర్‌ఎస్పీ వంటి ప్రాజెక్టులతో 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రధాని ప్రశంసించారని, బ్యాంకులు కూడా సహాయం చేశాయన్నారు. ఇప్పుడు కేవలం కేసీఆర్‌నే దోషిగా ఎత్తిచూపే ప్రయత్నం జరుగుతుందన్నారు. పిల్లర్లు కుంగితే సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అన్నారు. కవిత కొత్తగా ఏం ప్రకటించలేదన్నారు. కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీని తప్పుబట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ పాలనలో జాబ్ క్యాలెండర్‌కు దిక్కులేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డిల ఆక్రమణలపై ఎందుకు మాట్లాడలేదని కల్వకుంట్ల కవితను నిలదీశారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.