అప్పుడే పార్టీ పెడితే ప్రజల్లో ఆదరణ
వాటాల్లో తేడాతోనే కవిత బయటకు
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పార్టీ పెట్టినందుకు ధన్యవాదాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. అమ్మగా జేబులు చూసి కాదు కడుపు చూసి పాలిస్తానని కవిత చెప్పారని, కానీ బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జేబులు చూసి పరిపాలించారని కవిత చెప్పడం హర్షనీయమన్నారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో టీఆర్‌ఎస్ పుట్టిందని, బీఆర్‌ఎస్‌గా మారి అధికారంలో ఉన్నప్పుడే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో మంచి ఆదరణ వచ్చేదన్నారు. అధికారంలోకి వచ్చి తెలంగాణను దోపిడీ చేస్తే, పదేళ్లు కవిత మౌనంగా ఉన్నారని, వాటాల్లో తేడాలు వచ్చి కవిత బయటకు వచ్చినట్లుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని ఎంపీ చామల విమర్శించారు. తెలంగాణను దోచుకోవడానికే కవిత సీఎం కావాలని అంటున్నారని విమర్శించారు. కవిత నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామన్నారు.






