అభివృద్ధిని ఓర్వలేకనే బీఆర్‌ఎస్ నేతల అసత్య ప్రచారాలు
గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 7: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంటే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక కోహెడలోని పండ్ల మార్కెట్ స్థల విషయంలో అసత్య ప్రచారం చేస్తూ.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం తొర్రూరులోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపేటలో ఉన్న గడ్డి అన్నారం ఫోర్డ్ మార్కెట్ ను ట్రాఫిక్, భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ ప్రభుత్వ హయాంలో 2012లో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ పేరు మీద 180 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుకు మతిమరుపు ఎక్కువై... ఇష్టానుసారంగా ప్రభుత్వం పై నిందలు చేస్తున్నారని అన్నారు.
ఏ ఒక్క రైతు వ్యాపారి లేకుండా కోహెడ పండ్ల మార్కెట్ స్థలంలో మంత్రి హరీష్ రావు సమావేశాలు నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. కోహెడ మార్కెట్ స్థలంలో బీఆర్‌ఎస్ పార్టీ సుమారు 5 కోట్లతో షెడ్లను నిర్మిస్తే 80 కిలోమీటర్ల మీరా వచ్చిన గాలివానకు షెడ్లు మొత్తం చిందరవందరగా పడి రైతులు, వ్యాపారులు వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో మట్టి అమ్ముకుంటూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు.
కోహెడ లోని ఆ రెండు స్థలాలు మార్కెట్ కు సంబంధించినవేనని స్పష్టం చేశారు. అలాగే 178 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ ను నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని, త్వరలో సీఎం చేతుల మీదుగా ఫ్రూట్ మార్కెట్ పనులను శ్రీకారం చుడుతామన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరచారి, డైరెక్టర్లు మధుసూదన్ రావు, పన్యాల జైపాల్ రెడ్డి, మేకం లక్ష్మి, గణేష్ నాయక్, మచ్చెందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నవరాజ్, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీం, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.




