31 May, 2026 | 9:22 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి

08-04-2026 12:18 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం హవేలీఘనాపూర్ మండలంలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  పలు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. Together for Health  Stand With Science అనే థీమ్ను ప్రస్తావిస్తూ, ప్రజలు శాస్త్రీయ దృక్పథంతో ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఆరోగ్యం అనేది కేవలం వ్యాధుల లేమి మాత్రమే కాకుండా శారీరక, మానసిక, సామాజిక సంక్షేమం కలగలిపిన సమగ్ర స్థితి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సమతుల ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లను తప్పనిసరిగా అలవరచుకోవాలని సూచించారు.

ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించి, మిల్లెట్ ఆహారం, పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి పద్ధతులను అనుసరించాలని తెలిపారు.సీజనల్ వ్యాధులు, జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, స్థానిక సర్పంచ్, పిహెచ్సి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.