ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు
మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం నగరంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష, ఘోరమైన ఘటనను భారత రాష్ట్ర సమితి (Brs) ఖమ్మం జిల్లా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై బీఆర్ఎస్ MLC మరియు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం శుక్రవారం ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. సభ్య సమాజాన్ని తీవ్రంగా కలచివేసిన ఈ ఘటనలో బాధిత బాలికకు తక్షణమే న్యాయం చేయాలని, నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ బృందం డిమాండ్ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల ఈ సందర్భంగా వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి త్వరితగతిన న్యాయం జరిగేలా కేసును ఫాస్ట్-ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని, బాధిత బాలికకు ప్రభుత్వం తరపున అవసరమైన వైద్య, ఆర్థిక, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత తక్షణమే కల్పించాలని, భవిష్యత్తులో జిల్లాలో ఇలాంటి దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా మహిళలు, బాలికల రక్షణ కోసం గట్టి నిఘా, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, హాస్టళ్లు, అపార్ట్‌మెంట్‌లు, ఇతర ప్రాంతాలలో బాలికల మరియు మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక నిఘా ఉంచాలని, పోక్సో చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, బాలల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు అమలు చేయాలని కోరారు.
నేరస్థులు ఏ స్థాయిలో ఉన్నా వదలకుండా, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం ద్వారానే సమాజంలో నేరగాళ్లకు గట్టి హెచ్చరిక పంపినట్లవుతుందని బీఆర్ఎస్ బృందం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో పాటు మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, వున్నం బ్రహ్మయ్య, భాషబోయిన వీరన్న, నాయకులు రెంటాల ఆనంద్, దర్గయ్య, బలుసు మురళీకృష్ణ, లింగనబోయిన సతీష్, మహమ్మద్ రఫీ, పగడాల నరేందర్, యలమద్ది రవి, గవర్రాజు శంకర్ రాజు, పటేటి సాయి, పోలూరి రామ్, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






