18 July, 2026 | 5:48 AM

మోతీలాల్ పరామర్శకు బీఆర్‌ఎస్ నేతలు

02-07-2024 04:22 AM
  • గాంధీ దవాఖాన వద్ద ఉద్రిక్తత
  • పల్లా, రాకేశ్‌రెడ్డి, బక్క జడ్సన్ అరెస్ట్
  • పోలీసుల తీరుపై వెల్లువెత్తిన నిరసనలు
  • చిక్కడపల్లిలో నిరుద్యోగుల జేఏసీ ధర్నా

హైదరాబాద్ సిటీబ్యూరో/ముషీరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహించి నియామకాలను చేపట్టాలని ఓయూ విద్యార్థి నాయకుడు మోతీలాల్‌నాయక్ చేస్తున్న నిరహార దీక్ష హైదరాబాద్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది. నిరుద్యోగులకు న్యాయం చేయాలని జూన్ 24న నిరాహార దీక్ష చేపట్టిన మోతీలాల్ గాంధీ దవాఖానలో నిరాహాదీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 7 రోజులుగా దీక్షను కొనసాగిస్తున్న ఆయనను పరామర్శించడానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి, బక్క జడ్సన్ గాంధీ ఆస్పత్రికి చేరుకోగా వారిని పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేశారు.

వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలువురు ఓయూ విద్యార్థి నాయకులనూ అదపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిరహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకున్ని పరామర్శించే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని నిలదీశారు. సీఎం, మంత్రులు ఢిల్లీ టూర్లు, పదవుల పంపకాలతో పాటు ప్రైవేట్ కార్యక్రమాలతో ఊరేగుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి మోతీలాల్‌ను పరామర్శించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రావడంతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలోనూ పోలీసులు దగ్గరుండి ఆయనను పంపించారని, తమపై ఈ నిర్బంధం ఏంటని ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవని, మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి లెక్కకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. 

అత్యుత్సాహం మానుకోవాలి: కేటీఆర్

తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ దవాఖాన వద్ద నిరుద్యోగ యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. పోలీసులు అదపులోకి తీసుకున్న వారందరినీ వెంటనే విడుదల చేయాలన్నారు. నిరుద్యోగులు, యువకులు డిమాండ్లు చేస్తున్నట్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

సీఎం వచ్చి మాట్లాడాలి

సీఎం వచ్చి నిరాహార  దీక్ష చేస్తున్న మోతీలాల్‌నాయక్‌తో మాట్లాడాలని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవాధ్యక్షుడు రాజారాంయాదవ్ డిమాండ్ చేశారు. మోతీ లాల్‌ను పరామర్శించడానికి గాంధీ ఆస్పత్రికి వచ్చిన రాజారాంయాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగుల కోసం సీఎం రేవంత్, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ వెంకట్, కాంగ్రెస్ నేతలు అశోక్‌నగర్‌లోని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారని, అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలను మరిచారన్నారు. 

సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద..

త్వరలో చేపట్టే డీఎస్సీలో 25 వేల పోస్టులను పెంచి మెగా డీఎస్సీని నిర్వహించాలని సిటీ సెంట్రల్ లైబ్రరీ నిరుద్యోగ జేఏసీ నాయకులు చల్లపాటి లక్ష్మణ్, యాదగిరి, మహేశ్, నగేశ్, పరుశరాముడు, కృష్ణ, గిరీశ్, వెంకట్ డిమాండ్ చేస్తూ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. గ్రూప్ మెరిట్ లిస్టును 1:100గా ఎంపిక చేయాలన్నారు.  

మోతీలాల్‌నాయక్‌కు పరామర్శ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిరాహార దీక్ష చేస్తూ, ఆరోగ్యం క్షీణించి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్‌ను సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ పరామర్శించారు. మోతీలాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిలదీశారు.