ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు
- ఫిరాయింపులపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
- ఎంగిలి మెతుకుల కోసం పార్టీ మారినవారిని పట్టించుకోవద్దు
- కవిత వస్తుంది.. జగిత్యాలలో సంజయ్‌కు బుద్ధి చెబుతాం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జగిత్యాల, జూలై 1 (విజయక్రాంతి): గతంలో ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.50 లక్షలతో దొరికిన దొంగ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఫిరాయింపులన్నీ రాజ్యాంగ విరుద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అడ్డగోలు, అలవికాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయారాం గయారాం లాంటి నీచ సంస్కృతిని సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. అంగట్ల బర్రెలు, గొర్రెలను కొన్నట్లు సీఎం ఎమ్మెల్యేలను కొని దొడ్లో కట్టేసుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ లైన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆక్రోషం బాధాకరమని వ్యాఖ్యానించారు.
సీఎంకు కేటీఆర్ సవాల్
తాము రాజ్యాంగబద్ధంగానే చేరికలను అనుమతించామని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ రేవంత్ ఒక్కొక్క ఎమ్మెల్యేను రాజ్యాంగ విరుద్ధంగా చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ చేశారు. రేవంత్ అన్నట్టు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల మనస్సుల్లో రేవంత్‌రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడిపోతున్న ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కష్టపడి గెలిపిస్తే వియ్యంకుడి కాంట్రాక్టులు, క్రషర్ల కోసం పార్టీ మారారని ఎద్దేవా చేశారు.






