18 July, 2026 | 5:36 AM

‘నీట్’పై మోదీ మౌనం వీడాలి

02-07-2024 04:39 AM
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకులు
  • కేంద్ర ప్రభుత్వం స్పందిచకుంటే ఉద్యమం ఉధృతం
  • విద్యార్థి, యువజన సంఘాల నాయకుల హెచ్చరిక

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1: బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నీట్ పేపర్ లీకులు జరుగుతున్నాయని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. లీకులతో దేశ ప్రతిష్ఠ మసకబారుతోందని విమర్శించారు.  సోమవారం ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, వీజేఎస్, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, వైజేఎస్ తదితర విద్యార్థి, యువజన సంఘాల నాయకులు సోమాజిగూడలోని రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. రాజ్‌భవన్ వైపు ర్యాలీగా వెళ్తున్న వారిని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థి, యువజన సంఘాల నాయకులకు గాయా లయ్యాయి.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణి కంఠరెడ్డి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్, వీజేఎస్ అరుణ్‌కుమార్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆమనగంటి వెంకట్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్, వైజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సలీంపాషా తదితరులు మాట్లాడుతూ.. నీట్ పరీక్షపై మోదీ మౌనం వీడ కుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ విషయమై వినతిపత్రం ఇవ్వడానికి గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరామని..  అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో రాజ్‌భవన్ ముట్టడికి బయల్దేరామని చెప్పారు.

పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్‌ను తొలగించిందన్నారు. బాధిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  అయితే ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పీఎస్‌కు తరలించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు రామకృష్ణ, రమేష్, చందనారెడ్డి,  జావీద్, అశోక్‌రెడ్డి, శ్రీకాంత్, మమత, ఆజాద్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.